మంచిర్యాలక్రైం: ‘గణేశ్ నిమజ్జన శోభాయాత్రకు పోలీస్ అధికారులు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.. నిర్దేశించిన రూట్ మ్యాప్ ద్వారానే శోభాయాత్ర నిర్వహించాలి’ అని స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు సూచించారు. జిల్లా కేంద్రంలోని ఎం.కన్వెన్షన్ హాల్‌లో పోలీసులు, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ మతాల పెద్దలతో శాంతి కమిటీ సమవేశం నిర్వహించి మాట్లాడారు. మతాలకు అతీతంగా అన్ని వర్గాలు వారు సమన్వయంతో వినాయకుని శోభాయాత్ర ప్రశాంతంగా సంబరంగా జరుపుకోవాలని సూచించారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా నిమజ్జన శోభాయాత్ర జరుపుకోవాలని తెలిపారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీస్ అధికారులు చేపట్టిన చర్యలకు వారి ఆదేశాలను గౌరవించి సహకరించాలని కోరారు. పోలీస్, ఫైర్, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. స్థానిక ఏసీపీ ప్రకాశ్, సీఐ ప్రమోద్‌రావు, మేయర్ మధుకర్, డిప్యూటీ మేయర్ రమ్య, సంబంధిత శాఖల అధికారులు, మండపాల నిర్వాహకులు, పీస్ కమటీ పెద్దలు పాల్గొన్నారు.


