బెల్లంపల్లి: పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ(వైఐఎస్‌యూ)లో విలీనం చేయొద్దని డిమాండ్ చేస్తూ బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు శనివారం నిరసన వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల రారష్ట్‌ర జేఏసీ పిలుపు మేరకు తరగతులు బహిష్కరించి కళాశాల ప్రాంగణంలో వంటావార్పు చేశారు. భోజనం, కూరగాయలు వండి అక్కడనే భోంచేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ సాంకేతిక విద్య అభ్యసిస్తే సత్వరంగా ఉద్యోగాలు వస్తాయనే ఆశతో పాలిటెక్నిక్ కళాశాలల్లో చేరితే ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేసి తమ భవిష్యత్‌ను అగాథంలోకి నెట్టడానికి యత్నాలు చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వం దిగి వచ్చేవరకు ఆందోళనలు నిర్వహిస్తామని ప్రకటించారు.


