విదేశాలకు పత్తి, మామిడి | - | Sakshi
Sakshi News home page

విదేశాలకు పత్తి, మామిడి

Sep 20 2026 1:39 AM | Updated on Sep 20 2026 1:39 AM

● ఎగుమతులకు ప్రోత్సాహం ● రెండు పంటల గుర్తింపు

మంచిర్యాలఅగ్రికల్చర్‌: జిల్లాలో అధికంగా సాగు అవుతున్న పత్తి, మామిడి పంటలు విదేశాలకు ఎగుమతి కానున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో 31 జిల్లాలను సమ్మిళిత ఎగుమతి వృద్ధి కార్యాచరణ కార్యక్రమం కింద ఎంపిక చేసింది. ప్రతీ జిల్లా నుంచి ప్రత్యేక ఉత్పత్తులను ఎంపిక చేసి బ్రాండ్‌ గుర్తింపు ఇవ్వగా.. జిల్లా నుంచి పత్తి, మామిడి ఎగుమతిని ప్రోత్సహించేందుకు ఎంపిక చేశారు. అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం ద్వారా సరైన మద్దతు ధర లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం పంటలకు గిట్టుబాటు ధర లభించక, స్థానిక మార్కెట్‌ సౌకర్యాలు లేక దళారులపై ఆధారపడే రైతులు ఇకపై అంతర్జాతీయ మార్కెట్‌లో నేరుగా పోటీ పడే అవకాశం లభిస్తుంది. ఎగుమతులకు అవసరమైన చర్యల వేగవంతానికి జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన ప్రత్యేక ప్రోత్సాహక కమిటీ ఈపీసీ(ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కమిటీ) ఏర్పాటు చేయనున్నారు. కమిటీ ఆధ్వర్యంలో రైతులకు ప్రోత్సాహం, నాణ్యమైన దిగుబడి సాధనకు సాంకేతిక పరిజ్ఞానం, అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. సేకరణ, నాణ్యత గ్రేడింగ్‌, ప్యాకేజింగ్‌, నిల్వ, రవాణా వరకు ఎగుమతి ప్రక్రియను సమన్వయం చేస్తారు. ఎగుమతుల్లో ఎదురయ్యే సమస్యల పరిష్కారంలో కమిటీ కీలకంగా వ్యవహరిస్తుంది.

తెల్లబంగారానికి డిమాండ్‌

జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం అధికంగా ఉంటుంది. ఈ ఏడాది 1.72లక్షల ఎకరాల్లో సాగైంది. 12 నుంచి 13లక్షల క్వింటాళ్ల వరకు దిగుబడి రానుంది. ఏటా ప్రభుత్వ రంగ సంస్థలు కొర్రీలతో కొనుగోలుకు నిరాకరిస్తుండడంతో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో మద్దతు ధర లభించక నష్టపోతున్నారు. పత్తికి విదేశీ మార్కెట్లలో మంచి డిమాండ్‌ ఉంది. స్థానిక వ్యాపారులు, దళారులపై ఆధారపడడం తగ్గి మంచి ధర పొందే అవకాశం లభిస్తుంది.

మరింత విలువ..

జిల్లాలో 15,477.32 ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. ఏటా 45వేల నుంచి 50వేల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుంది. సరైన మార్కెటింగ్‌ సౌకర్యం, కోల్డ్‌స్టోరేజీ లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దళారులను ఆశ్రయించాల్సి వస్తుంది. పక్కనే ఉన్న మహారాష్ట్రకు తరలించి విక్రయిస్తున్నారు. ఓసారి ధరలు అనుకూలిస్తే మరోసారి పెట్టుబడీ రాక నష్టపోతున్నారు. ఎగుమతుల్లో నాణ్యత, గ్రేడింగ్‌, ప్యాకింగ్‌ కీలకం కానున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో ఎగుమతి చేస్తే మెరుగైన ధర లభిస్తుంది. ఎగుమతులు పెరిగితే జిల్లాలో ప్రాసెసింగ్‌, గ్రేడింగ్‌, ప్యాకేజింగ్‌, కోల్డ్‌స్టోరేజీ ఏర్పాటై యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

రసాయనాలు లేకుండా సాగు చేయాలి

జిల్లాలో మామిడి దిగుబడి కోసం రైతులు పూత దశ నుంచి రసాయనిక మందులు పిచికారీ చేస్తున్నారు. మోతాదుకు మించి వాడడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ఎగుమతికి అవకాశం ఉండదు. సేంద్రియ విధానాలతో సాగు చేసే ఉత్పత్తులే విక్రయాలకు అవకాశం ఉంటుంది. రానున్న రోజుల్లో రెతులకు అధికారులు అవగాహన కల్పించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement