మంచిర్యాలఅర్బన్: మంచిర్యాల బస్‌స్టేషన్ ఆధునీకరణ రూ.20కోట్లతో చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే కే.ప్రేమ్‌సాగర్‌రావు తెలిపారు. శనివారం ఆర్టీసీ అధికారులతో కలిసి బస్టాండ్‌ను పరిశీలించారు. ప్రయాణికుల మౌలిక వసతులు, సౌకర్యాలపై చర్చించారు. బస్టాండ్ విస్తరణ, ప్లాట్‌ఫాం నిర్మాణంపై పరిశీలించారు. ప్రస్తుత ప్లాట్‌ఫారాలు ఎన్ని ఉన్నాయి.. కొత్తగా ఏర్పాటు చేయాల్సిన వాటిపై అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా సులువుగా బస్సులు తిరిగేలా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. అంతకుముందు ఆర్టీసీ అధికారులు డిపో పరిసరాలను పరిశీలించి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జోన్ ఈడీ సోలోమాన్, ఈడీ, ఐటీ, పీఅండ్‌ఎం హైదరాబాద్ రాజశేఖర్, ఆర్‌ఎం విజయభాను, ఆదిలాబాద్ డిప్యూటీ ఆర్‌ఎంవో మల్లేశయ్య, అసిస్టెంట్ డిపో మేనేజర్ శ్రీలత, మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి భానేష్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరేష్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
రద్దీకి అనుగుణంగా బస్సులు
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయని కరీంనగర్ జోన్ ఈడీ సోలోమాన్ అన్నారు. శనివారం ఈడీ, ఐటీ, పీఅండ్‌ఎం హైదరాబాద్ జోన్ రాజశేఖర్, ఆర్‌ఎం విజయభాను, డిప్యూటీఆర్‌ఎం మల్లేశయ్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు. మంచిర్యాల నుంచి కాళేశ్వరానికి వెళ్లే మహిళా ప్రయాణికులకు మహారాష్ట్ర సరిహద్దులో నిబంధనల మేరకు ఉచితంతోపాటు నగదు టికెట్ వర్తిస్తుందని తెలిపారు. రాబోయే పుష్కరాల్లో భక్తులకు ఆటంకం లేకుండా బస్సులు నడిపిస్తామని తెలిపారు.


