నెన్నెల: ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న ఓ ప్రభుత్వ ఉద్యోగి పెద్దపేగు క్యాన్సర్ బారిన పడి వైద్యం కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రానికి చెందిన చిన్నయ్య ఆదిలాబాద్ డివిజన్‌లోని బేల రేంజ్ అటవీశాఖలో ల్యాండ్ అండ్ సర్వేలో స్పెషల్ డ్యూటీలో పనిచేస్తున్నాడు. కొంతకాలంగా పెద్దపేగు క్యాన్సర్‌తో బాధపడుతూ హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటి వరకు అప్పులు చేసి సుమారు రూ.15 లక్షల వరకు వైద్య ఖర్చులు భరించాడు. ప్రస్తుతం వైద్యులు అత్యవసరంగా ఆపరేషన్ చేయాల్సి ఉందని సూచించారు. చేతిలో డబ్బులు లేక చికిత్సను కొనసాగించలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ఈహెచ్‌ఎస్ కార్డు ఉన్నా ప్రయోజనం సున్నా
ప్రభుత్వ ఉద్యోగులకు అందుబాటులో ఉండే ఈహెచ్‌ఎస్ వైద్య సదుపాయం తనకు ఉన్నప్పటికీ కార్డు పనిచేయడం లేదని చిన్నయ్య వాపోతున్నాడు. ఆన్‌లైన్‌లో తన వివరాలు కనిపించకపోవడంతో వైద్యసేవలు పొందలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సంబంధిత అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించి అత్యవసర వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. తన పరిస్థితిని రాష్ట్రస్థాయి అధికారులు, మంత్రుల దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వపరంగా వైద్య సదుపాయం అందించాలని వేడుకుంటున్నాడు. తనకు అత్యవసరంగా ఆపరేషన్ అవసరం ఉందని ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్యం ఆగిపోకుండా ప్రభుత్వం మానవతాదృక్పథంతో స్పందించాలని కోరుతున్నాడు. ఈహెచ్‌ఎస్ ఉన్నతాధికారులు, అటవీ శాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వైద్య సహాయం అందించాలని బాధిత కుటుంబ సభ్యులు సైతం వేడుకుంటున్నారు. వరాల కోసం 9182391985 నంబర్‌ను సంప్రదించాలని కోరుతున్నారు.


