కాసిపేట: బాలికలు భవిష్యత్‌లో గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ బారిన పడకుండా హెచ్‌పీవీ టీకాలు వేయడంలో సంబంధిత శాఖ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా వారీగా లక్ష్యం కేటాయించి మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు టీకాలు సరఫరా చేశారు. 14నుంచి 15ఏళ్లలోపు బాలికలకు టీకాలు వేయాల్సి ఉండగా.. అవగాహన లేక తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. అధికారులు సైతం అవగాహన కల్పించడంలో విఫలం కావడంతో లక్ష్యాన్ని చేరలేకపోతున్నారు. 17రకాల గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్‌లలో నాలుగు ప్రధానమైన వేరియంట్లు గుర్తించి 6, 11, 16, 18కోడ్‌లతో తయారు చేసిన హెచ్‌పీవీ టీకాను రాష్ట్రంలో వేస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో వయస్సుతో సంబంధం లేకుండా మూడు డోస్‌లకు సుమారు రూ.15వేల వరకు ఖర్చవుతోంది. ప్రభుత్వం ఉచితంగా టీకాలు వేయిస్తుండగా అవగాహన లోపించి వినియోగించుకోవడం లేదు. 14ఏళ్లు నిండి 15వ సంవత్సరం దాటక ముందు పుట్టిన తేదీ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసి టీకాలు వేస్తుండగా ఈ ఏడాది మార్చి నాటికి జిల్లాలో 4,632మంది లక్ష్యంగా నిర్ధారించారు. రోజువారీగా పుట్టిన తేదీలతో అర్హుల సంఖ్య పెరగడం, తగ్గడం జరుగుతోంది. మార్చి నాటి లక్ష్యం ప్రకారం జిల్లాలో 2,507మందికి టీకాలు వేశారు. చాలా మండలాల్లో 25శాతం కూడా వేయలేదని తెలుస్తోంది. ఉన్నత పాఠశాలల్లో పిల్లల తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు, మహిళా సంఘాల ద్వారా అవగాహన కల్పిస్తే లక్ష్యం చేరే అవకాశాలున్నాయి.
అవగాహన కల్పిస్తున్నాం
గ్రామాల్లో బాలికల తల్లిదండ్రులకు ఆశ, ఏఎన్‌ఏం, అంగన్‌వాడీల ద్వారా అవగహన కల్పిస్తున్నారు. వాక్సిన్ లక్ష్యం అంటూ ఏమీ లేదు. పుట్టిన తేదీ ఆధారంగా 14ఏళ్లు దాటి 15ముగిసేలోపు బాలికలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి వేస్తున్నాం. రోజువారీగా అర్హులు పెరుగుతారు, తగ్గుతారు. తల్లిదండ్రులు వాక్సిన్‌పై అపోహలు వీడి బాలికలకు వేయించాలి.
– సుధాకర్ నాయక్, డీఐఈవో, మంచిర్యాల


