టూరిజం హబ్‌గా కవ్వాల్‌ | - | Sakshi
Sakshi News home page

టూరిజం హబ్‌గా కవ్వాల్‌

Sep 19 2026 6:20 AM | Updated on Sep 19 2026 6:20 AM

బంధీపూర్‌ తరహాలో టైగర్‌ రిజర్వ్‌లో సౌకర్యాలకు సన్నాహాలు వన్యప్రాణుల కోసం అనుకూలమైన వాతావరణం ఏర్పాటు ఇతర ప్రాంతాల నుంచి పులులు తీసుకొచ్చే యోచన

జన్నారం: తెలంగాణలోని కవ్వాల్‌ టైగర్‌జోన్‌ను టూరిజం హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. పులులు, వన్యప్రాణుల సంరక్షణతో పాటు టూరిస్టులు ఇష్టపడే రీతిలో తగిన ఏర్పాట్లు చేయనుంది. ఏకో టూరిజంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తగు ప్రణాళికలు తయారు చేస్తోంది. కర్ణాటక రాష్ట్రంలోని బంధీపూర్‌ టైగర్‌ రిజర్వ్‌, మహారాష్ట్రలోని తడోబా టైగర్‌ రిజర్వ్‌లలో అనుసరిస్తున్న విధానాన్ని కవ్వాల్‌ టైగర్‌జోన్‌లో కూడ అవలంభించనున్నారు. ఇప్పటికే జన్నారం అటవీ డివిజన్‌లో బేస్‌క్యాంపులు, స్ట్రైకింగ్‌ ఫోర్స్‌, ఎనిమల్‌ ట్రాకర్స్‌, ఎకో టూరిజం సఫారీ డ్రైవర్లు, గైడ్‌లు మొత్తం కలిపి సుమారు 96 మందికి ఉపాధి లభిస్తోంది.

పులుల సంరక్షణతో సమగ్ర అభివృద్ధి

ప్రస్తుతం అమ్రాబాద్‌ టైగర్‌జోన్‌తో పోలిస్తే కవ్వాల్‌ టైగర్‌జోన్‌లో పర్యాటకుల తాకిడి తక్కువగా ఉంది. అమ్రాబాద్‌లోకి పులుల రాకపోకలు ఉండడంతో పర్యటకుల తాకిడి పెరిగింది. ఈ పరిస్థితిని మార్చేందుకు నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అఽథారిటీ (ఎన్‌టీసీఏ) అనుమతితో ఇతర ప్రాంతాల నుంచి పులులను కవ్వాల్‌కు తీసుకొచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. పులుల సంరక్షణకు అనుకూలమైన వాతావరణం కల్పించి, నిఘాతో బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని వన్యప్రాణి నిపుణులు పేర్కొంటున్నారు. అడవి చుట్టూ ఉన్న గిరిజనులను పర్యాటక రంగంలో భాగస్వామ్యం చేస్తే పులుల సంరక్షణ సాధ్యమవుతుందనే భావన ఉంది.

ఆదాయ వనరులు పెరిగే అవకాశం..

2012లో ఏర్పాటైన కవ్వాల్‌ టైగర్‌జోన్‌ 2015 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. బందీపూర్‌, కన్హా, పెంచ్‌, రణతంబోర్‌, తడోభా టైగర్‌ రిజర్వ్‌లతో పోలిస్తే కవ్వాల్‌ టైగర్‌జోన్‌లో అభివృద్ధి తక్కువగా ఉంది. ఎకో టూరిజం అభివృద్ధి జరిగితే ఆదాయ వనరులు పెరుగుతాయి. నాలుగేళ్ల క్రితం అప్పటి ఎఫ్‌డీవో మాధవరావు ఇక్కడ టూరిజం ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేశారు. సఫారీ తిరిగే దారులు, టూరిజం స్పాట్‌లలో టాయిలెట్లు, కట్టడాలు, విశేషాలను తెలిపే బోర్టులను ఏర్పాటు చేశారు. డివిజన్‌లోని బైసన్‌కుంట, మైసమ్మ కుంట, గొండుగూడ, నీలుగాయి కుంట, మల్యాల వాచ్‌టవర్‌, బర్తన్‌పేట వాచ్‌టవర్‌ తదితర ప్రాంతాలను అభివృద్ధి చేసి, పర్యాటకులకు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. దీంతో కొంతమేర పర్యాటకుల తాకిడి పెరిగింది. అయితే నాలుగేళ్ల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం పర్యాటకుల సందర్శన తగ్గింది. ఇక్కడ నిధులు లేక అభివృద్ధి జరగడం లేదు.

ఆరు పులులు తెచ్చే అవకాశం..

వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి కవ్వాల్‌ టైగర్‌జోన్‌కు పర్యాటకులు వస్తుంటారు. ప్రతీ సంవత్సరం అక్టోబర్‌ నుంచి జూన్‌ వరకు పర్యాటకులను సఫారీల ద్వారా అడవుల్లోకి తీసుకెళ్తున్నారు. ఇక్కడి అడవుల్లో పులులు కనిసిస్తే పర్యాటకంగా మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. టైగర్‌ రీ ఇంట్రడక్షన్‌లో భాగంగా ఆరు పులులను కవ్వాల్‌కు తీసుకొచ్చే అవకాశం ఉంది. పులులు ఉన్న కారణంగా అమ్రబాద్‌ టైగర్‌జోన్‌కు ఏటా రూ.1.80 కోట్ల –రూ. 2.20 కోట్ల ఆదాయం వస్తోంది. కానీ కవ్వాల్‌ టైగర్‌జోన్‌లో కేవలం రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల ఆదాయం వస్తున్నట్లు అధికారులు అంచనా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement