కాసిపేట: మందమర్రి ఏరియా కల్యాణిఖని ఓపెన్‌కాస్ట్‌లో శుక్రవారం మండలంలోని సోమగూడం(కె) గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. భారీగా గ్రామస్తులు ఓసీ వద్దకు చేరుకొని పనులను అడ్డుకొని అధికారులతో వాదనకు దిగారు. గ్రామాలకు సమీపంలో ఓసీ ఏర్పాటు చేయడంతో పేలుళ్లతో ఇళ్లు పగుళ్లు తేలి కూలుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓసీ నుంచి వెలువడుతున్న దుమ్ము, ధూళితో జీవనం దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించి పేలుళ్ల తీవ్రత తగ్గించాలని లేకుంటే గ్రామాన్ని పూర్తి స్థాయి ముంపు గ్రామంగా ప్రకటించి అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. విషయం తెలుసుకున్న సింగరేణి అధికారులు, పోలీసులు వారికి నచ్చజెప్పారు. సమస్యల పరిష్కారానికి ఓసీ ప్రాజెక్టు ఆఫీసర్ రాంబాబు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్, ఏఐబీఎస్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు సపాటు శంకర్, ఉపసర్పంచ్ స్రవంతి, వార్డు సభ్యులు ప్రశాంత్, తిరుపతి, భుక్య పద్మ, సురేశ్, రమేశ్, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.


