కాజీపేట: కేంద్ర ప్రభుత్వం సుమారు పదేళ్ల క్రితం రద్దు చేసిన రూ.1.38 కోట్ల విలువ చేసే పాత కరెన్సీ నోట్లను రవాణా చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచినట్లు కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. హనుమకొండ జిల్లా కాజీపేట పోలీస్‌స్టేషన్ ఆవరణలో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కాజీపేట చౌరస్తాలో వాహనాల తనిఖీ చేస్తుండగా ఓ వాహనంలోని వ్యక్తుల కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో సోదా చేశారు. దీంతో 2016లో ప్రభుత్వం రద్దు చేసిన రూ.500, రూ.వెయ్యి నోట్ల కట్టలు బయటపడ్డాయి. దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన ముల్లా అబ్బాస్, మంచిర్యాల జిల్లా హాజీపూర్‌కు చెందిన బాసవేని మల్లేష్, కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన తంగళ్ల కృష్ణమోహన్, సిద్దిపేటకు చెందిన కుక్కల సంపత్, హనుమకొండకు చెందిన రైనాకుల శ్రీధర్, పల్లపు రాజు, వరంగల్ కరీమాబాద్‌కు చెందిన మహంకాళి శ్యాంసుందర్, నెక్కొండ మండలం చంద్రుగొండకు చెందిన మాంకాల గణేశ్‌లను అరెస్ట్ చేశారు. వీరిని విచారించగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి నోట్ల సరఫరాకు సహకరించినట్లు గుర్తించారు. ఆ వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉండగా, నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీపీ తెలిపారు. సమావేశంలో సీఐ శ్యాంసుదర్, ఎస్సైలు మౌనిక, శివ, తాళ్లపల్లి యాదగిరి, శ్రీనివాస్, సిబ్బంది సునీత, అశోక్‌కుమార్, శ్రీధర్, క్రాంతికుమార్, కుమారస్వామి, విష్ణు, వినయ్ పాల్గొన్నారు.


