వరుస చోరీలకు పాల్పడుతున్న ఐదుగురి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

వరుస చోరీలకు పాల్పడుతున్న ఐదుగురి అరెస్టు

Aug 18 2026 12:15 AM | Updated on Aug 18 2026 12:15 AM

నిర్మల్‌టౌనన్‌: వరుస చోరీలకు పాల్పడుతున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు భైంసా ఏఎస్పీ సాయికిరణ్‌ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. నిర్మల్‌కు చెందిన రాజశేఖర్‌, రాజేశ్వర్‌, రామ్‌చరణ్‌ స్నేహితులు. ముగ్గురు పనిచేసే ప్రాంతంలో నిర్మల్‌ రూరల్‌ మండలం చిట్యాలకు చెందిన శ్రీకాంత్‌, అక్కాపూర్‌కు చెందిన క్రాంతితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా స్నేహంగా మారడంతో ఐదుగురూ కలిసి చోరీలకు పాల్పడడం ప్రారంభించారు. తొలుత ఇళ్లను ఎంచుకున్న నిందితులు పో లీసులకు త్వరగా చిక్కే అవకాశం ఉందని భావించి ఆలయాలను టార్గెట్‌ చేసుకున్నారు. రాత్రివేళల్లో రెక్కీ నిర్వహించి సీసీ కెమెరాలు లేని గుర్తించి చోరీకి పాల్పడేవారు. నిర్మల్‌ పట్టణంలోని దివ్యనగర్‌ అయ్యప్పస్వామి ఆలయం, శాస్త్రినగర్‌ హనుమాన్‌ఆలయం, బంగల్‌పేట్‌ మహాలక్ష్మీ ఆలయం, కౌట్ల కె రామాలయం, మామడ మండలం కొరిటికల్‌ వేంకటేశ్వరస్వామి ఆలయం, సారంగాపూర్‌ మండలం వంజర్‌ మహాలక్ష్మీ ఆలయం, ఆలూర్‌ శివాలయం, లోకేశ్వరం మండలం కిష్టాపూర్‌ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, లక్ష్మణచాంద మండలం వడ్యాల్‌ హనుమాన్‌ఆలయం, తానూర్‌ మండలం పోచమ్మ ఆలయాల్లో జరిగిన చోరీ కేసుల్లోనూ వీరి ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో నమోదైన 25 చోరీ కేసుల్లో నిందితుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు.

ఏపీలోనూ..

నిందితులు నిర్మల్‌ జిల్లాకే పరిమితం కాలేదని ఏపీలోని గన్నవరం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం, ఏలూరు 3 టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని వినాయక ఆలయంలో జరిగిన చోరీ కేసుల్లోనూ వీరి ప్రమేయం ఉన్నట్లు ఏఎస్పీ వెల్లడించారు.

టెక్నాలజీతో చిక్కారు

వరుస చోరీలపై ప్రత్యేక దృష్టి సారించిన టైగర్స్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సీసీ పుటేజీలు, సాంకేతిక ఆధారాలతో ఒక్కొక్కరిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. 16 కేసుల్లో చోరీ సొత్తును రికవరీ చేశామని, మూడు ద్విచక్ర వాహనాలు, ఏడున్నర గ్రాముల బంగారం, 300 గ్రాము ల వెండి, ఐదు మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇంకా కొన్ని కేసులకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందన్నారు. సమావేశంలో డీఎస్పీ శ్రీనివాస్‌, నిర్మల్‌ పట్టణ, రూరల్‌ సీఐలు సమ్మయ్య, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement