పక్కాగా పంటల లెక్క.. | - | Sakshi
Sakshi News home page

పక్కాగా పంటల లెక్క..

Aug 16 2026 11:29 PM | Updated on Aug 16 2026 11:29 PM

● సాగు వివరాల నమోదుకు వ్యవసాయశాఖ సన్నద్ధం ● రెండు, మూడు రోజుల్లో సర్వే షురూ..

దండేపల్లి: జిల్లాలో పంటల సాగు లెక్కా పక్కాగా నమోదు కానుంది. జిల్లాలో ఎంతమంది రైతులు ఉన్నారు?.. సాగుభూమి ఎంత ఉంది?.. అందులో ఏఏ రకాల పంటలు సాగవుతున్నాయి?.. సర్వే నంబర్లు ఎన్ని ఉన్నాయి?.. ఇలాంటి అంశాలపై లెక్కలు పక్కాగా ఉండాలనే ప్రభుత్వ ఆదేశాలతో వ్యవసాయశాఖ అధికారులు రెండు, మూడు రోజుల్లో వానాకాలం పంటల నమోదు సర్వే ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే గ్రామస్థాయిలో వాలంటీర్లను ఎంపిక చేశారు.

సర్వే ప్రక్రియ ఇలా..

గతంలో ఏఈవోల ద్వారా పంటల నమోదు (సర్వే) చేపట్టేవారు. వారికి ఇతర విధులు, పనిభారం, కొన్ని క్లస్టర్లలో ఏఈవోల పోస్టులు ఖాళీగా ఉండడం, తదితర కారణాలతో ప్రతీ వ్యవసాయ సీజన్‌లో క్రాప్‌ సర్వే ఆలస్యమయ్యేది. ఈ నేపథ్యంలో గత యాసంగి సీజన్‌లో గ్రామానికి ఒక వలంటీర్‌ను నియమించి సర్వే చేశారు. గతేడాది వానాకాలం సీజన్‌లోనూ ప్రైవేటు వాలంటీర్లను నియమించి గ్రామాల్లో ఏఈవోల ఆధ్వర్యంలో సర్వే చేపట్టాలని నిర్ణయించారు. ఈసారీ కూడా వలంటీర్లతోనే క్రాప్‌ సర్వే చేయనున్నారు. వలంటీర్లకు ముందుగా మొబైల్‌ యాప్‌ ద్వారా పంటల నమోదుపై అవగాహన కల్పిస్తారు. ఆ తర్వాత వారు క్షేత్రస్థాయికి వెళ్లి సర్వే నంబర్ల వారీగా పంటల ఫొటో తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు.

పంట నమోదుతో ప్రయోజనం

పంటల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. పంట విక్రయ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. నమోదు కాకుంటే పంట విక్రయ సమయంలో ఇబ్బందులు తలెత్తుతాయని అధికారులు పేర్కొంటున్నారు. ఈసారీ వర్షాలు ఆలస్యంగా కురువడంతో ప్రస్తుతం జిల్లాలో వానాకాలం సాగు పనులు కొద్దిరోజుల క్రితం నుంచి ఊపందుకున్నాయి. కొన్నిచోట్ల తొలకరి వర్షాలకు పత్తిసాగు చేయడంతో విత్తనాలు మొలకెత్తయి. పత్తిలో కలుపు తీత, ఎరువులు వేసే పనుల్లో రైతులు బిజీ అయ్యారు. జూలై ఆఖరులో, ఆగస్టు మొదటి వారంలో కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్టులతో పాటు, చెరువులు, కుంటలు, నిండుకుండను తలపిస్తున్నాయి. బావులు, బోర్లలో నీటిమట్టం పెరగడంతో రైతులు సాగు పనులు ముమ్మరం చేశారు. దీంతో వ్యవసాయశాఖ పంటల నమోదుకు సన్నద్ధమవుతోంది. ఈ సర్వేతో ఏ పంటకు ఎంత దిగుబడి వస్తుందనేది సులభంగా తెలుస్తుంది. దిగుబడులకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, మద్దతు ధరను ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. ప్రకృతి వైపరీత్యాల సమయంలో జరిగిన నష్టాన్ని కచ్చితత్వంతో తెలుసుకునే వీలుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement