అధికారులు వచ్చేనా.. పరిష్కారం లభించేనా? | - | Sakshi
Sakshi News home page

అధికారులు వచ్చేనా.. పరిష్కారం లభించేనా?

Aug 16 2026 11:29 PM | Updated on Aug 16 2026 11:29 PM

● నేటి నుంచి మండలాల్లో ప్రజావాణి ● గతంలో నిర్వహించినా కలెక్టరేట్‌కే అర్జీదారులు

మంచిర్యాలఅగ్రికల్చర్‌: మండల కేంద్రాల్లో గతంలో ప్రతీ సోమవారం నిర్వహించిన ప్రజావాణికి స్పందన కరువైంది. వివిధ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు అర్జీదారులు కలెక్టరేట్‌లో నిర్వహించనున్న ప్రజావాణికి వచ్చి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మళ్లీ నేటి నుంచి మండల కేంద్రాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనిపై ప్రజల నుంచి స్పందన ఏవిధంగా ఉంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అందుబాటులో ఉండేనా?

మండల కేంద్రాల్లో నిర్వహించిన ప్రజావాణిలో భూ సమస్యలు, పరిహారం, పెన్షన్లు, రోడ్లు, విద్యుత్‌ సమస్యలపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అర్జీదారులు ఆసక్తి కనబర్చలేదు. దీంతో పాటు వివిధ శాఖ అధికారులు పాల్గొనాల్సి ఉండగా ఒక్కరిద్దరు మాత్రమే అందుబాటులో ఉండడం, వచ్చినవారు సమయపాలన పాటించకపోగా మొక్కుబడిగా వచ్చి సంతకాలు చేసి వెళ్తున్నారనే విమర్శలు వచ్చాయి. ఒక్కరిద్దరు సమస్యలు విన్నవించేందుకు వచ్చినా అధికారులు అందుబాటులో లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయేవారు. కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణిలో కలెక్టర్‌, వివిధ శాఖల అధికారులు అందుబాటులో ఉంటుండడంతో ఇక్కడైతేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందనే ఆశతో ఫిర్యాదు చేస్తున్నారు. కొన్ని సమస్యలకు అప్పటికప్పుడు పరిష్కారం లభించగా మరికొన్ని విచారణకు ఆదేశిస్తున్నారు. దీంతో కొన్ని నెలలుగా మండల కేంద్రాల్లో ప్రజావాణి నిర్వహించడం లేదు. మళ్లీ ప్రతీ సోమవారం మండల కేంద్రాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం అదేశించింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫిర్యాదులు స్వీకరించనున్నారు. 18 మండలాల్లో నోడల్‌ అధికారులుగా ఎంపీడీవోలు వ్యవహరించనున్నారు. ఆయా శాఖలకు చెందిన అధికారులు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంది. ప్రతీ ఫిర్యాదును ప్రజావాణి పోర్టల్‌లో నమోదు చేసి అర్జీదారునికి ఐడీతో రశీదు ఇవ్వనున్నారు. ఇప్పటికే మండల స్థాయి అధికారులు, సిబ్బందికి శిక్షణ అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement