జీజీహెచ్‌లో వైద్యసిబ్బంది పోస్టులు ఖాళీ
కొన్ని విభాగాల్లో అరకొర సేవలు
ఆర్థోకే పరిమితమైన ఆపరేషన్ థియేటర్
నాలుగేళ్లుగా నిలిచిన కంటి శస్త్ర చికిత్సలు
మంచిర్యాలటౌన్: మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)లో వైద్యసిబ్బంది పోస్టులు ఖాళీగా ఉండడంతో ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందడం లేదు. 484 మందికి బదులుగా 416 మంది వైద్యసిబ్బంది పనిచేస్తుండగా ఇంకా 68 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుబంధంగా కొనసాగుతున్న ఆస్పత్రిలోని ఆయా విభాగాల వైద్యసేవలపై ప్రభావం చూపుతోంది. మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలతో పాటు, మహారాష్ట్రకు చెందిన రోగులు వైద్యం కోసం జీజీహెచ్‌కు వస్తుంటారు. పలు విభాగాల్లో వైద్య సేవలు అందక, తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోంది. వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ విద్యార్థులకు బోధించేందుకు ప్రొఫెసర్లు తప్పనిసరిగా ఉండి, వారు జనరల్ ఆసుపత్రిలో వైద్యసేవలు అందించాల్సి ఉంటుంది. ఆయా పోస్టులు ఖాళీ గా ఉండడంతో, అందు కు సంబంధించిన విభాగాల్లో ఎంబీబీఎస్ విద్యార్థుల కు బోధన జరగక పోవడంతో పాటు రోగులకు వైద్యసే వలు అందడం లే దు. మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి వచ్చే గర్భిణులకు స్కా నింగ్ చేసేందుకు రేడియాలజిస్టులు లేకపోవడంతో బెల్లంపల్లి సామాజిక ఆస్పత్రి వైద్యుడిని వారంలో మూడు రోజుల పాటు ఇక్కడ విధులు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.
శస్త్ర చికిత్సలు జరగవు
ప్రస్తుతం ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరుకుంది. జిల్లా కేంద్రంలోని కాలేజీరోడ్డులో గల ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్వహించిన ప్రాంతంలో రూ.129.25 కోట్లతో మూడేళ్ల క్రితం భవన నిర్మాణ పనులు ప్రారంభించగా ఇప్పటికీ పూర్తి కాలేదు. శిథిలావస్థకు చేరిన ఆస్పత్రిలో కేవలం ఆర్థోకు సంబంధించిన శస్త్ర చికిత్సలు మాత్రమే చేస్తున్నారు. గదులు అందుబాటులో ఉన్నా, పాత భవనం కావడం వల్ల, తరచూ ఏదో ఒక సమస్య తలెత్తుతుండడంతో వైద్యులు శస్త్ర చికిత్సలకు ముందుకు రావడం లేదు. నాలుగేళ్లుగా కంటికి సంబంధించిన శస్త్ర చికిత్సలు చేయకపోవడం గమనార్హం. నూతన భవనం పూర్తయితే ఆస్పత్రిలో అన్ని విభాగాలకు సంబంధించిన వైద్య సేవలు అందడంతో పాటు, అధునాతన పరికరాలు, శస్త్ర చికిత్సలు చేసేందుకు ప్రత్యేక గదులు అందుబాటులోకి వస్తాయి. దీంతో రోగులను కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ వంటి నగరాలకు రెఫర్ చేయకుండా, మంచిర్యాలలోనే మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుంది. నూతన భవనంలోకి మారేందుకు మరో రెండు నెలల సమయం పట్టనుంది. ప్రస్తుతం నిర్వహిస్తున్న భవనంలోనే శస్త్ర చికిత్సలన్నీ చేసేలా చూడాలని రోగులు కోరుతున్నారు.
మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి భవనం శిథిలావస్థకు చేరడం, పూర్తిస్థాయి సౌకర్యాలు లేకపోవడం, వర్షాలకు స్లాబ్ పెచ్చులూడి పోయి, భయానకంగా మారడం, వార్డుల్లోకి వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రజలకు పూర్తిస్తాయిలో వైద్యసేవలు అందించలేక పోతున్నారు. ఆస్పత్రిలో శస్త్ర చికిత్సలు చేసేందుకు ఒకే ఒక ఆపరేషన్ థియేటర్ ఉండగా, అందులో ఆర్థో విభాగానికి సంబంధించిన ఆపరేషన్లు మాత్రమే చేస్తున్నారు. ఇతర విభాగాలకు చెందిన శస్త్ర చికిత్సలు సైతం చేసేందుకు తగిన సౌకర్యాలు లేకపోవడంతో వైద్యసేవలు ఓపీకే పరిమితం అవుతున్నాయి. నూతన జీజీహెచ్ భవన నిర్మాణం పూర్తయితే అన్ని విభాగాలకు సంబంధించిన వైద్యసేవలు, శస్త్ర చికిత్సలు చేసేందుకు అవకాశం ఉండనుంది. నూతన భవనం వినియోగంలోకి వచ్చేలోపు ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటే, ప్రజలకు పూర్తిస్థాయి వైద్యం అందించే అవకాశం ఉంటుంది.


