టీచర్ల పాత డిప్యూటేషన్లు రద్దు చేస్తారా.. కొనసాగిస్తారా?
ఏళ్ల తరబడి పాతకుపోయిన వారి సంగతేమిటి..?
పెరిగిన అడ్మిషన్లు.. పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు
ఆయా మండలాల్లో బోధకుల కొరత
మంచిర్యాలఅర్బన్: ఏళ్ల తరబడి సొంత పాఠశాలలను వదిలి డిప్యూటేషన్‌ల పేరిట పట్టణాలకే పరిమితమైన టీచర్ల పాత సర్దుబాటు (వర్క్ అడ్జస్ట్‌మెంట్) ఆర్డర్ రద్దు చేసి కొత్తగా చేపడుతారా? అనే ప్రతిష్టంబన కొనసాగుతోంది. ఇదివరకు ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ ప్రణాళికారాహిత్యం వల్ల విద్యావ్యవస్థలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఒకే పాఠశాల, పట్టణ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి ఉపాధ్యాయులను సర్దుబాటు పేరుతో ఉంచేసి గ్రామీణ, మండలాల్లో ఉపాధ్యాయుల అవసరం ఉన్నా పట్టించుకోకపోవటం వల్ల ఇక్కట్లు ఎదురవుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో అవసరానికి మించి నిబంధనలకు విరుద్ధంగా నాలుగేసి మండలాలు దాటి డిప్యూట్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. మారుమూల ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయకపోవడంతో అక్కడ చదివే విద్యార్థుల విద్యాప్రమాణాలపై ప్రభావం చూపుతోంది.
జిల్లాలో ఇదీ పరిస్థితి
జిల్లాలోని 709 పాఠశాలల్లో 43,702 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రైమరీలో 15,311, అప్పర్ ప్రైమరీలో 4,419, సెకండరీలో 15,637, హయ్యర్ సెకండరీలో 7,705 మంది విద్యార్థులున్నారు. గతేడాది కంటే 10 శాతం అడ్మిషన్లు పెంచేలా నిర్ణయించారు. గతేడాది 2,464 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తుండగా తక్కువ విద్యార్థులుండి ఎక్కువ ఉపాధ్యాయులున్న మరో పాఠశాల టీచర్లు 168 మందిని వర్క్ అడ్జస్ట్‌మెంట్ చేశారు. ప్రస్తుతం అడ్మిషన్ల సంఖ్య పెరగడంతో ఎక్కడెక్కడా ఖాళీలున్నాయో గుర్తించినట్లు తెలుస్తోంది.


