ఉట్నూర్‌రూరల్: ఆదివాసీ సంస్కృతి, సంప్రదా యాలు గొప్పదని ఎంపీ గోడం నగేశ్ పేర్కొన్నారు. ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్‌లో పీఎంఆర్సీ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మాజీ ఎంపీ సోయం బాపూరావు, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో మంద మకరందు, ఏఎస్పీ రిత్విక్ హాజరయ్యారు. ముందుగా కుమురం భీం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరంఆదివాసీ భవనం నుంచి ఐబీ, కేబీ కాంప్లెక్స్ వరకు ఆదివాసీ ప్రజలు, యువత, మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. సంప్రదాయ వేషధారణ, సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలతో ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇప్పపువ్వు లడ్డూ, హస్తకళలు, వివిధ స్టాళ్లను అతిథులు, అధికారులు సందర్శించారు. అనంతరం హాజరైన అతిథులు మాట్లాడారు. ఆదివాసీల అభివృద్ధికి, హక్కుల సాధనకు కృషిచేస్తామన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో వసతులు, తాగునీరు, విద్యుత్, రోడ్ల సమస్యలను శాఖల సమన్వయంతో పరిష్కరిస్తామని తెలిపారు. ప్రభుత్వ పథకాలు గిరిజనులను అందేలా చూస్తామన్నారు. ముగింపులో భాగంగా కలెక్టర్, ఎస్పీ, ఐటీడీఏ పీవో, ఆదివాసీ నాయకులతో కలిసి నృత్యాలు చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.


