ఈ బ్రిడ్జి ఎంసీసీ క్వారీ నుంచి క్వారీ మీదుగా గఢ్‌పూర్ గ్రామ పంచాయతీకి వెళ్లేందుకు ఉపయోగిస్తారు. రాళ్లవాగుపై ఎప్పుడో నిర్మించిన ఈ బ్రిడ్జిపై నుంచి ఒకే వాహనం వెళ్లేందుకు దారి ఉంది. నిత్యం వందలాది వాహనాలు వెళ్తుండడం, శిథిలావస్థకు చేరడంతో నూతన వంతెన నిర్మాణానికి రూ.10కోట్లు విడుదల చేశారు. పాత బ్రిడ్జి పక్కనే పనులు ప్రారంభించి పిల్లర్లు వేశారు. ఎంసీసీ యాజమాన్యం బ్రిడ్జి నిర్మాణంపై కోర్టుకు వెళ్లడం, స్టే ఆర్డర్‌తో పనులు నిలిచిపోయాయి. ఇటీవల కురిసిన వర్షాలకు వరద ఉధృతి పెరిగి బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు కోతకు గురైంది. దీంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితేనే ఆండాళమ్మ కాలనీ, రంగంపేట్, గఢ్‌పూర్‌కు వెళ్లే ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగవుతుంది.


