చేనేతకు ప్రకృతి రంగులు అద్దారు | - | Sakshi
Sakshi News home page

చేనేతకు ప్రకృతి రంగులు అద్దారు

Aug 7 2026 1:38 AM | Updated on Aug 7 2026 1:38 AM

● సహజసిద్ధ రంగుల తయారీలో దిట్ట ● కార్మికులకు శిక్షణ ఇస్తున్న ఓదెలు ● జర్మనీలోనూ సెమినార్‌ ● రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులు

చెన్నూర్‌: సామాన్య చేనేత కార్మికుడు తన ప్రతిభతో దారానికి ప్రకృతి రంగులు అద్దాడు. వస్త్రాలు నేసి రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. ప్రకృతిలో లభించే చెట్లతో సహజసిద్ధ రంగుల తయారీలో తనకున్న ప్రతిభతో నేత కార్మికులకు, అంతర్జాతీయ స్థాయిలోనూ శిక్షణ ఇచ్చే స్థాయికి ఎదిగాడు. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ పట్టణంలోని పద్మనగర్‌ కాలనీకి చెందిన ఉరగొండ ఓదెలు చెన్నూర్‌ చేనేత సొసైటీలో కార్మికుడిగా పని చేశాడు. దస్తకార్‌ స్వచ్ఛంద సంస్థ ప్రకృతిసిద్ధమైన రంగుల తయారీపై సొసైటీ కార్మికులకు శిక్షణ ఇచ్చింది. ఓదెలు అందరిలా శిక్షణ పొంది వదిలేయలేదు. రంగుల తయారీపై ప్రత్యేక దృష్టి సారించాడు. చేనేత వస్త్ర తయారీలో కుటుంబ పోషణ భారం కావద్దంటే రంగుల తయారీయే మార్గమని భావించాడు. అటవీ ప్రాంతంలో లభించే మోదుగ, తంగేడు, కరక్కాయ, ఇండిగో చెట్ల బెరడుతో రంగుల తయారీలో పట్టు సాధించాడు. ఆయన ప్రతిభను గుర్తించిన హైదరాబాద్‌లోని దస్తకార్‌ సంస్థ సహజ సిద్ధ రంగుల తయారీపై నేత కార్మికులకు శిక్షణ ఇచ్చేందుకు అవకాశం కల్పించింది. అనంతరం మల్కా ట్రస్టులో చేరి ఆ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పలు సొసైటీల్లో ప్రకృతి రంగుల తయారీపై శిక్షణ ఇస్తున్నాడు. ప్రస్తుతం సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో చేనేత కార్మికులకు ప్రకృతి సిద్ధమైన రంగుల తయారీపై అవగాహన కల్పిస్తున్నారు. ఓదెలు ప్రతిభను గుర్తించిన మల్కా సంస్థ ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకృతిసిద్ధమైన రంగులపై జర్మనీలో జరిగిన అంతర్జాతీయ సెమినార్‌కు పంపించింది. రంగుల తయారీ, దారానికి రంగులు వేసి సెమినార్‌లో విదేశీయుల ప్రశంసలు అందుకున్నాడు.

రాష్ట్ర, జాతీయ అవార్డులు..

అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి అవార్డును అప్పటి ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ అందజేశారు. 2023లో జాతీయ స్థాయి అవార్డును కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement