బస మరిచారు..! | - | Sakshi
Sakshi News home page

బస మరిచారు..!

Aug 7 2026 1:38 AM | Updated on Aug 7 2026 1:38 AM

● గురుకులాలు, హాస్టళ్లలో సమస్యలు ● కొరవడిన ఆకస్మిక సందర్శన, పర్యవేక్షణ ● ఇటీవల బెల్లంపల్లి మహాత్మా జ్యోతిబా పూలే గురుకులంలో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ● గత ఫిబ్రవరిలో బెల్లంపల్లి ఎస్సీ సమీకృత బాలికల వసతిగృహంలో 16మంది ఫుడ్‌ పాయిజన్‌తో అస్వస్థతకు గురయ్యారు. ● చెన్నూర్‌ మహాత్మాజ్యోతిరావు పూలే గురుకుల కళాశాలలో సౌకర్యాలు లేవని 17మంది పారిపోయారు. ● చెన్నూర్‌ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలల్లో అల్పాహారం తర్వాత ముగ్గురు విద్యార్థులు కనిపించకుండా పోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ● జిల్లా కేంద్రంలోని ఎస్టీ ఆశ్రమ పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు వెళ్లిపోయిన ఘటనపై విద్యార్థి సంఘం ఫిర్యాదు చేసింది. ● ఎస్టీ వసతిగృహంలో బదిలీపై వచ్చిన వార్డెన్‌ ఎవరి ఒత్తిడో ఏమో తెలియదు గానీ తాను ఇక్కడ పని చేయలేనంటూ లిఖిత పూర్వకంగా రాసిచ్చేంత వరకు వచ్చినట్లు తెలుస్తోంది. ● బెల్లంపల్లిలో బీసీ వసతిగృహంలో విద్యార్థుల ధర్నాపై విచారణ కమిటీ వేయగా మరో వార్డెన్‌ పాత్ర ఉందని ప్రచారం.

మంచిర్యాలఅర్బన్‌: పేద విద్యార్థులు విద్య కోసం ఆశ్రయం పొందుతున్న సంక్షేమ గురుకులాలు, వసతిగృహాల్లో పర్యవేక్షణ కొరవడింది. గతంలో ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. అదనపు కలెక్టర్‌, జిల్లా ఉన్నతాధికారులు ప్రతీ పదిహేను రోజులకోసారి ఏదో వసతిగృహాన్ని సందర్శించి రాత్రి బస చేయాల్సి ఉంది. విద్యార్థులు తమ సమస్యలు, ఆహారం, వసతులు, వేధింపులు వంటి వాటిపై నేరుగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం లభిస్తుంది. రాత్రివేళల్లో తనిఖీల వల్ల నిర్వాహకుల్లో జవాబుదారీతనం పెరిగి మెనూ పక్కాగా అమలవుతుంది. కానీ అధికారులు రాత్రి బస చేయకపోవడం వల్ల డైట్‌ మెనూ సక్రమంగా అమలు కాకపోవడం, సరైన పరిశుభ్రత లేక విద్యార్థులు తరచూ అస్వస్థతకు గురవుతున్నారు. విద్యార్థులు పారిపోయిన ఘటనల నేపథ్యంలో భద్రతపై తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతోంది. కొన్నిచోట్ల భవనాలు శిథిలావస్థకు చేరడం, ఇతరత్రా సమస్యలు నెలకొన్నాయి. గురుకులాలు, వసతిగృహాల్లో రాత్రి బస చేయడం ద్వారా సమస్యల పరిష్కారంతోపాటు విద్యార్థులు ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అభద్రతాభావం తొలగిపోతుంది. పరిసరాల పరిశుభ్రత, మెనూ పక్కాగా అమలయ్యే అవకాశం ఉంటుంది.

వరుస ఘటనలతో కలవరం

సంక్షేమ గురుకులాలు, వసతిగృహాల్లో నిరంతర తనిఖీలు లేకపోవడంతో అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. అల్పాహారం, భోజనం ఎలా అమలవుతుందో తెలియకుండా పోతోంది. మెనూ అమలుపై విద్యార్థులు ఆందోళనబాట పడుతున్నారు. బదిలీల ప్రక్రియ ముగియగానే వార్డెన్ల మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తోంది. బదిలీపై వచ్చిన వార్డెన్లపై ఒత్తిడి పెంచి వెళ్లిపోయేలా.. మరోచోట వార్డెన్‌ను తొలగించేలా పావులు కదిపినట్లు తెలుస్తోంది. విద్యార్థులు హాస్టల్‌ నుంచి పారిపోవడం, ఫుడ్‌ పాయిజన్‌తో అస్వస్థతకు గురైన సంఘటనలు కలవరపెడుతున్నాయి.

గురుకులాల వసతిగృహాలు సంఖ్య విద్యార్థులు

మైనార్టీ 04 1,114

ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ 08 4,010

సోషల్‌ వెల్ఫేర్‌ 09 5,017

ఎస్సీ వసతిగృహాలు 25 2,282

బీసీ వసతిగృహాలు 18 1,420

కేజీబీవీ 18 5,850

ఎస్టీ వసతి, ఆశ్రమ పాఠశాలలు 16 2,600

మోడల్‌స్కూళ్ల హాస్టళ్లు 04 400

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement