ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన
ఒక్కరోజే 102.8 మిల్లీమీటర్ల వర్షపాతం
ఉప్పొంగిన ప్రాణహిత, గోదావరి
ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు
39 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు
బెల్లంపల్లి: పట్టణంలోని రాంనగర్ లోలెవల్ బ్రిడ్జిని రామగుండం సీపీ అంబర్ కిశోర్‌ఝా, సబ్ కలెక్టర్ మనోజ్, డీసీపీ భాస్కర్, మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి, కమిషనర్ రమేశ్, సీఐలు కె.శ్రీనివాసరావు, హనోక్ పరిశీలించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద నీటి ప్రవాహం పెరగడంతో ప్రమాదకరంగా మారిన జాతికుంట చెరువు కట్టను మున్సిపల్ చైర్‌పర్సన్ సందర్శించి లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 18 వార్డు కాంట్రాక్టర్ బస్తీలో మూడిళ్లు నేలమట్టమయ్యాయి. 13 వార్డులోని పలు ఇళ్లలోకి వరదనీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. పోశమ్మ చెరువు నిండి చంద్రవెళ్లికి వెళ్లే ప్రధాన రోడ్డుపై నుంచి వరద నీరు పోటెత్తడంతో గ్రామీణ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
అత్యవసరమైతేనే బయటకు రావాలి
మంచిర్యాలక్రైం: వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా గురువారం ఒక ప్రకటనలో కోరారు. ప్రమాదం పొంచి ఉందని తెలిస్తే 100కు సమాచారం అందించి పోలీసుల సహాయం పొందాలన్నారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లతో ప్రమాదం పొంచి ఉందని, అలాంటి ఇళ్లలో ఉంటున్న వారు ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వారు పోలీసుల హెచ్చరికలను పాటించాలన్నారు.
మంచిర్యాలఅగ్రికల్చర్: మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి జిల్లా జలమయం అయ్యింది. రికార్డు స్థాయిలో గురువారం ఒక్కరోజే 102.8 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మందమర్రి, బెల్లంపల్లి, జైపూర్, నస్పూర్, మంచిర్యాల, కాసిపేట, నెన్నెల, వేమనపల్లి మండలాల్లో 100 నుంచి 160 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు కాలనీల్లోని డ్రైనేజీలు పొంగిపొర్లి మురుగునీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగులు, వంకలు ఉగ్రరూపం దాల్చడంతో దిగువ ప్రాంతాల్లోని రోడ్లు, తాత్కాలిక వంతెనలు తెగిపోయాయి. కల్వర్టుల పైనుంచి వరదనీరు ప్రవహిస్తుండడంతో పలుచోట్ల జనజీవనం స్తంభించింది. వాగులు ఒర్రెలు ఉప్పొంగడంతో 39 గ్రామాలకు రాకపోకలకు నిలిచిపోయాయి. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోని పత్తి, కంది పంట చేలను వరద నీరు ముంచెత్తింది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో ర్యాలీవాగు, నీల్వాయి ప్రాజెక్టులు మత్తడి దుకుతున్నాయి. ప్రాణహిత వరద ప్రవాహం పెరిగింది.
లోటు నుంచి అధికం
జిల్లా సాధారణ వర్షపాతం ఇప్పటి వరకు 467.3 మిల్లిమీటర్లు కాగా 512.2 మిల్లిమీటర్లు నమోదైంది. సాధారణం కంటే 11 శాతం అధికంగా వర్షం కురిసింది. రెండు రోజుల్లో లోటు నుంచి అధికానికి చేరింది. ఒక్క దండేపల్లి మండలంలో 42 శాతం లోటు నెలకొనగా బెల్లంపల్లి మండలంలో 69 శాతం అత్యధికంగా, కాసిపేట, మందమర్రి, మంచిర్యాల, తాండూర్ మండలాల్లో 30 నుంచి 43 శాతం అధికంగా, మిగితా 8 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.
అధికారులు అప్రమత్తం
జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రెవెన్యూ, పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు. వాగులు, వంకలు దాటేందుకు సాహసించవద్దని సూచిస్తున్నారు. ఎల్లంపల్లి నుంచి గోదావరిలోకి నీటి విడుదలతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని ఆదేశిస్తున్నారు.
మత్తడి దూకిన నీల్వాయి ప్రాజెక్ట్
వేమనపల్లి: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నీల్వాయి ప్రాజెక్ట్ మత్తడి దూకి ప్రవహిస్తోంది. చామనపల్లి పెద్దవాగు, మామాడ ఒర్రె ప్రమాదకరంగా ప్రవహించాయి. ఎంపీడీవో కుమారస్వామి, సర్పంచ్ చెన్నూరి సమ్మయ్య, తహసీల్దార్ సాయికృష్ణ, ఒర్రెవద్ద ప్రమాద సూచికలు ఏర్పాటు చేశారు. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాల్లోని పంటచేలు చెరువులను తలపించాయి.


