మామడ: మండలంలోని పొన్కల్ గోదావరి వద్ద ఉన్న సదర్మాట్ బ్యారేజీ పూర్తి స్థాయి నీటి మట్టంతో జలకళ సంతరించుకుంది. గురువారం భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు బ్యారేజీ రెండు గేట్లు ఎత్తి గోదావరి దిగువకు నీటిని వదులుతున్నారు. బ్యారేజీ పూర్తిస్థాయి నీటి మట్టం 1.580 టీఎంసీ కాగా ప్రస్తుతం 1.25 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 10వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా 9300 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
అడ 6, వట్టివాగు 4 గేట్లు..
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు ప్రాజెక్టుల్లో చేరుతోంది. కుమురం భీం (అడ) ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తి 40,238 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులున్నారు. ప్రాజెక్టు నీటి మట్టం సామర్థ్యం 10.393 టీఎంసీలు (238 మీటర్లు) కాగా ప్రస్తుతం నీటి సామర్థ్యం 6.001 టీఎంసీలు వాటర్ లెవల్ 237.70 మీటర్లు ఉంది. వరద నీరు రావడంతో ఇన్‌ఫ్లో 30,423 క్యూసెక్కులు కాగా ఆరు గేట్లు 2 మీటర్లు ఎత్తి 40,238 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. వట్టివాగు ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి 43,333 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 2.890 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి సామర్థ్యం 2.480 టీఎంసీలుగా ఉంది. ఇన్‌ఫ్లో 36,000 క్యూసెక్కులు కాగా 4 గేట్లు ఎత్తి 43,333 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో గుండి, ఆసిఫాబాద్ వాగులు మరింత ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
మత్తడి వాగు ప్రాజెక్టు నాలుగు గేట్లు..
తలమడుగు: తాంసి, తలమడుగు మండలాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మత్తడివాగు ప్రాజెక్టు ఐదు గేట్లు ఉండగా అధికారులు నాలుగు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. మత్తడి వాగు ప్రాజెక్టు మొత్తం సామర్థ్యం 0.571 టీఎంసీలు కాగా ఇన్‌ఫ్లో 38,000 క్యూసెక్కుల నీరు వస్తుండగా, అధికారులు అవుట్‌ఫ్లో 38,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.


