వైష్ణవ్‌జీ.. రైలు వేయండి | - | Sakshi
Sakshi News home page

వైష్ణవ్‌జీ.. రైలు వేయండి

Jul 31 2026 2:03 AM | Updated on Jul 31 2026 2:03 AM

రైల్వేలైన్‌ కోసం కదిలిన ‘కాషాయం’ కేంద్రమంత్రిని కోరిన బీజేపీ ప్రజాప్రతినిధుల బృందం సానుకూలంగా స్పందించిన అశ్వినీవైష్ణవ్‌

నిర్మల్‌: జిల్లావాసుల రైలు కల సాకారమయ్యే దిశగా పట్టాలు పడుతున్నాయి. ఈ ప్రాంత ప్రజలు, ప్రజాప్రతినిధులు ఇంకెన్ని దశాబ్ధాలు మొర పెట్టుకోవాలంటూ ‘విన్నపాలు.. ఎన్నిసార్లు..’ శీర్షికన ఈనెల 13న ‘సాక్షి’ దినపత్రిక ప్రచురించిన కథనం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజాప్రతినిధులను కదిలించింది. ఈమేరకు ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు గురువారం ఢిల్లీలో కేంద్ర రైల్వేశాఖమంత్రి అశ్వినీవైష్ణవ్‌ను కలిశారు. ఉత్తర తెలంగాణ ప్రజలు, ప్రధానంగా రైల్వేలైన్‌ లేని నిర్మల్‌వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆర్మూర్‌ –నిర్మల్‌ –ఆదిలాబాద్‌ రైల్వేలైన్‌ ప్రాజెక్టుకు ఆమోదం తెలపాలని కోరారు.

కలిసి వెళ్లి.. సుదీర్ఘంగా వివరించి..

జిల్లా మీదుగా రైల్వేలైన్‌ నిర్మాణం చేపట్టాలని ఎంపీ నగేశ్‌, బీజేఎల్పీనేత మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పాయల్‌ శంకర్‌, రామారావుపటేల్‌ పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఇలా కలిసిన ప్రతిసారీ రైల్వేమంత్రి ఏదో నామమాత్రంగా సమాధానమిస్తూ వచ్చారు. ఈసారి మాత్రం పక్కాగా ప్రజాప్రతినిధులు ఢిల్లీకి వెళ్లారు. బీజేఎల్పీనేత మహేశ్వర్‌రెడ్డి, ఆదిలాబాద్‌ ఎంపీ నగేశ్‌ సారథ్యంలో నిజామాబాద్‌, మెదక్‌, మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్‌ ఎంపీలు ధర్మపురి అర్వింద్‌, రఘునందన్‌రావు, ఈటెల రాజేందర్‌, డీకే అరుణ, ఆదిలాబాద్‌, ఆర్మూర్‌, నిజామాబాద్‌ ఎమ్మెల్యేలు పాయల్‌ శంకర్‌, రాకేశ్‌రెడ్డి, ధన్‌పాల్‌ సూర్యనారాయణగుప్తా, బీజేపీ నిర్మల్‌ జిల్లా అధ్యక్షుడు రితేశ్‌ రాథోడ్‌లు బృందంగా కలిసి వెళ్లారు. మంత్రి కార్యాలయంలోనే భేటీ అయ్యారు. ఈ రైల్వేలైన్‌ నిర్మాణ ఆవశ్యకతపై సుదీర్ఘంగా అశ్వినీవైష్ణవ్‌కు వివరించారు. ఈ ప్రాంతంలో వరుసగా బీజేపీ ఎంపీని గెలిపించడంతో పాటు ఈ లైన్‌ నిర్మాణం చేపట్టాల్సిన నియోజకవర్గాల్లోనూ బీజేపీ ఎమ్మెల్యేలను గెలిపించారన్న విషయాన్నీ మంత్రి దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం.

అశ్వినీవైష్ణవ్‌ గ్రీన్‌సిగ్నల్‌..!

రైల్వేలైన్‌ కోసం బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసికట్టుగా వచ్చి చేసిన ప్రతిపాదనపై కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌ సానుకూలంగా స్పందించారు. ప్రాజెక్టు పురోగతిపై అనుకూలంగా ఆయన సంకేతాలు ఇచ్చినట్లు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.

కదిలించిన ‘సాక్షి’ కథనాలు..

దేశంలోని ఉత్తర –దక్షిణ ప్రాంతాలను కలుపుతున్న గ్రాండ్‌ట్రంక్‌ రైల్వేలైన్‌కు ప్రత్యామ్నాయంగానూ ఆర్మూర్‌ –నిర్మల్‌ –ఆదిలాబాద్‌ రైల్వేలైన్‌ ఉపయోగపడుతుందని, దాదాపు 7లక్షల మంది ప్రజలను ప్రభావితం చేస్తుందని చాలా సందర్భాల్లో ‘సాక్షి’ వి భిన్న కథనాలు ప్రచురించింది. కొన్నేళ్లుగా పదేపదే కేంద్రానికి వినతులు ఇవ్వడంపై ఈనెల 13న ప్రచురితమైన ‘విన్నపాలు.. ఎన్నిసార్లు..’ కథనం ప్రజా ప్రతినిధులను కదిలించింది. ఈమేరకు కలిసికట్టుగా బీజేపీ ప్రజాప్రతినిధుల బృందం నేరుగా కేంద్ర రైల్వేమంత్రిని కలిసి ప్రాజెక్టుకు ఆమోదం కోరడంలో కీలకమైంది.

సానుకూలంగా స్పందించారు..

రైల్వేలైన్‌ నిర్మాణం కోసం బీజేపీ ప్రజాప్రతినిధులంతా మంత్రి అశ్వినీవైష్ణవ్‌ను ఢిల్లీలో కలిశాం. ఈ ప్రాంత ప్రజల కోరికతో పాటు రైల్వేలైన్‌ ఆవశ్యకత వివరించాం. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. – గోడం నగేశ్‌, ఎంపీ, ఆదిలాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement