బాసర: విద్యార్థులు జీవితంలో ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకొని, వాటి సాధన కోసం క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర కృషి, సమయపాలన, నైతిక విలువలతో ముందుకుసాగాలని ప్రొఫెసర్ సాయికుమార్ పేర్కొన్నారు. గురువారం ఆర్‌జీయూకేటీ, బాసరలో నిర్వహిస్తున్న పీయూసీఐ ఓరియంటేషన్ కార్యక్రమం 2026లో ఆయన వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ ఆర్‌జీయూకేటీలోని నాణ్యమైన విద్య, ఆధునిక ప్రయోగశాలలు, సాంకేతిక వనరులు, పరిశోధనా అవకాశాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేవలం అకాడమిక్ మార్కులకే పరిమితం కాకుండా కమ్యూనికేషన్ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకత, సమస్య పరిష్కార సామర్థ్యం, సామాజిక బాధ్యతను పెంపొందించుకుంటూ ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. వీసీ ప్రొఫెసర్ ఎ. గోవర్ధన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రతిభను ప్రపంచ స్థాయి నైపుణ్యంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే ఆర్‌జీయూకేటీ కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేస్తూ, అకాడమిక్స్‌తో పాటు సాంకేతిక ఆవిష్కరణల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి, వారి కలల సాకారానికి యాజమాన్యం ఎల్లప్పుడూ సహకారం అందిస్తుందన్నారు. పీయూసీఐ ఓరియంటేషన్ కార్యక్రమం 2026 సమన్వయకర్త డా. గుజ్జరి శంకర్ ఆధ్వర్యంలో నూతన విద్యార్థులకు విశ్వవిద్యాలయ విద్యా విధానం, క్యాంపస్ సౌకర్యాలు, విద్యార్థి సంక్షేమ కార్యక్రమాలు, క్లబ్‌లు, సాంకేతిక, వ్యక్తిత్వ వికాస అవకాశాలపై పూర్తి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


