ఉట్నూర్‌రూరల్: విద్యాజ్యోతి సమగ్ర ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమంలో భాగంగా ఉట్నూర్‌లోని స్థానిక బీఈడీ కళాశాలలో నిర్వహిస్తున్న ఆంగ్ల ఉపాధ్యాయుల సామర్థ్య పెంపు శిక్షణా కార్యక్రమాన్ని గురువారం ఐటీడీఏ పీవో మంద మకరందు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల అభ్యాసన సామర్థ్యం మెరుగుపరచడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. నాణ్యమైన విద్య అందించేందుకు ఆధునిక బోధనా విధానాలు, సృజనాత్మక కార్యకలాపాలు, సమర్థవంతమైన తరగతి నిర్వహణ, విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే మార్గాలు అనుసరించాలన్నారు. క్యాంప్ అధికారి, స్థానిక బీ.ఎడ్. కళాశాల ప్రిన్సిపాల్ రాథోడ్ మాణిక్ రావు, సహాయ క్యాంప్ అధికారి జాదవ్ విఠల్, ఏసీఎంవో జగన్ తదితరులు పాల్గొన్నారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి..
భారీ వర్షాలు కురుస్తున్నందున ఐటీడీఏ పరిధిలోని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని పీవో మంద మకరందు అధికారులను ఆదేశించారు. కంట్రోల్ సెంటర్ సిబ్బంది, వైద్య బృందాలు 24 గంటలపాటు అందుబాటులో ఉండాలని, సర్పంచ్‌లు, పటేళ్లు, ఎంపీడీవోలతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తూ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను అన్ని సమాచార మాధ్యమాల ద్వారా అప్రమత్తం చేయాలన్నారు. అలాగే పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800 425 5226 లేదా 08731 –275226 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.


