బజార్‌హత్నూర్: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని గిర్నూర్ గ్రామపంచాయతీ పరిధిలో గల కనకాయి జలపాతం, బండ్రేవ్ జలపాతాలు వరద నీటితో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
నేరడిగొండ: మండలంలోని కుంటాల, కొర్టికల్ జలపాతాలు జలకళ సంతరించుకున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో ఈ జలపాతాలు పొంగి ప్రవహిస్తున్నాయి. కొండకోనల మధ్య నుంచి పాలధారల వలే జాలువారుతున్న జలపాతాల అందాలు పర్యాటకులను పరవశింపజేస్తున్నాయి.
నార్నూర్: మండలంలోని మాన్కాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని పారాఖప్పి జలపాతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఉప్పొంగి పరవళ్లు తొక్కుతోంది. కొండల మధ్య నుంచి తెల్లని నురగలు చిమ్ముకుంటూ ఉధృతంగా కిందికి దూకుతున్న జలధార ప్రకృతి ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంటోంది. జలపాతం వద్ద వరద ప్రవాహం ఉధృతంగా ఉండటంతో ప్రజలు, యువకులు జలపాతం సమీపానికి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.


