జలపాతాలు.. పరవళ్లు
తిర్యాణి/ బోథ్: ఉమ్మడి జిల్లాలో జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని చింతలమాదర, గుండాల(బాహుబలి), ఆదిలాబాద్ జిల్లాలోని పొచ్చెర జలపాతాలు వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నీటిధారలు సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. నీటి ప్రవాహం అధికంగా ఉన్నందున పర్యాటకులు అప్రమత్తంగా ఉండి భద్రతా నియమాలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. గుండాల జలపాతంలో వరద ఉధృతి పెరగడంతో పర్యాటకుల సందర్శనకు అనుమతి లేదని ఫారెస్టు రేంజ్ అధికారి రమాదేవి తెలిపారు.
పొచ్చెర జలపాతం
చింతలమాదర జలపాతం
గుండాల జలపాతం
భైంసా: జిల్లా వ్యాప్తంగా బుధవారం వర్షాలు కురవడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సార్‌ఎస్పీ)కి వరదనీటి ప్రవాహం స్వల్పంగా పెరుగుతోంది. జిల్లాలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, కాలువల్లో నీటి ప్రవాహం కనిపించింది. ఎగువ ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తుండటంతో ఆ నీరు క్రమంగా ప్రాజెక్టులోకి చేరుతోంది. బుధవారం సాయంత్రం 6 గంటల సమయానికి ఎస్సార్‌ఎస్పీలో నీటి మట్టం 1065.40 అడుగులు నమోదు కాగా, నీటి నిల్వ 16.545 టీఎంసీలకు చేరుకుంది. ప్రస్తుతం జలాశయంలోకి సెకనుకు 3,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 751 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గత ఏడాది ఈరోజుతో పోలిస్తే ప్రస్తుతం జలాశయంలో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయి. గత ఏడాది జూలై 29న ఎస్సార్‌ఎస్పీ నీటి మట్టం 1075.00 అడుగులు, నీటి నిల్వ 32.897 టీఎంసీలుగా ఉంది.
సదర్‌మాట్ ఆనకట్టకు జలకళ
ఖానాపూర్: మండలంలోని మేడంపల్లి గ్రామ శివారులో ఉన్న సదర్‌మాట్ ఆనకట్టకు ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద నీరు భారీగా చేరుతోంది. ఆనకట్ట పూర్తిస్థాయిలో నిండిపోవడంతో అదనపు నీరు మత్తడి పైనుంచి ప్రవహిస్తూ గోదావరి నదిలో కలుస్తోంది.
స్వర్ణ ప్రాజెక్టుకు స్వల్పంగా పెరిగిన ఇన్‌ఫ్లో
సారంగపూర్: వుండలంలోని స్వర్ణ ప్రాజెక్టుకు ఈ ఏడాది తొలిసారి వరదనీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1183 అడుగులు కాగా నిన్నటి వరకు 1170 అడుగులు ఉంది. అయితే మంగళవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కురిసిన ఒక మోస్తారు వర్షానికి వరదనీరు వచ్చి చేరడంతో ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 3అడుగులు పెరిగి ప్రస్తుతం 1173.8 అడుగులకు చేరుకున్నట్లు ఏఈ వేణుగోపాల్ తెలిపారు.
కడెం ప్రాజెక్ట్‌కు వరద
కడెం: ఎగువన కురుస్తున్న వర్షాలతో కడెం ప్రాజెక్ట్‌కు వరద నీరు వచ్చి చేరుతోంది. బుధవారం ప్రాజెక్ట్‌కు 22,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చినట్లు ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 700(3.495టీఎంసీలు) అడుగులు కాగ, ప్రస్తుతం 689.150 (1.484టీఎంసీలు) అడుగుల నీటిమట్టం ఉంది. వరదల నేషథ్యంలో సీఈ జగదీశ్ ప్రాజెక్ట్‌ను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో పెరిగితే వరద గేట్లు ఎత్తే అవకాశం ఉన్నందును నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎస్‌ఈ రాజేంద్రప్రసాద్, ఈఈ ప్రవీణ్, డీఈ వీరన్న, ఏఈఈ మురళీ తదితరులు ఉన్నారు.


