గల్ఫ్‌ మోసాలపై అప్రమత్తత అవసరం | - | Sakshi
Sakshi News home page

గల్ఫ్‌ మోసాలపై అప్రమత్తత అవసరం

Jul 30 2026 12:15 AM | Updated on Jul 30 2026 12:15 AM

నిర్మల్‌ఖిల్లా: ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లే భారతీయ వలస కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, రిక్రూట్‌మెంట్‌ మోసాలు, వేతన దోపిడీ, చట్టపరమైన పరిష్కార మార్గాలపై హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించిన భాగస్వామ్య వర్క్‌షాప్‌లో సమగ్రంగా చర్చించారు. సెంటర్‌ ఫర్‌ ఇండియన్‌ మైగ్రెంట్‌ స్టడీస్‌ (సీఐఎంఎస్‌), మైగ్రెంట్‌ ఫోరమ్‌ ఇన్‌ ఆసియా (ఎంఎఫ్‌ఏ) సంయుక్త ఆధ్వర్యంలో రాయల్‌ రేవ్‌ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ రిక్రూట్‌మెంట్‌ సంస్థల ప్రతినిధులు, న్యాయవాదులు, సౌదీ కేస్‌ హ్యాండ్లర్లు, వలస కార్మికుల సంక్షేమ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. నిర్మల్‌ జిల్లా నుంచి ఎన్‌ఆర్‌ఐ అడ్వైజరీ కమిటీ రాష్ట్ర సభ్యుడు స్వదేశ్‌ పరికిపండ్ల, కెనడా ఎంబసీ మాజీ సలహాదారు సంపత్‌ కుమార్‌ హాజరై సౌదీ అరేబియాలో ఉపాధి కోసం వెళ్లిన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై పలు కేస్‌స్టడీలను విశ్లేషించారు.

ఉమ్మడిజిల్లా ఘటనలపై నివేదన..

సౌదీ అరేబియాలో పనిచేస్తున్న పలువురు కార్మికులకు నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడం, అక్కడికి చేరుకున్న తర్వాత ఉద్యోగ ఒప్పందంలోని నిబంధనలను ఏకపక్షంగా మార్చివేయడం వంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. బాధిత కార్మికుల్లో 90 శాతం మందికి ఉద్యోగ ఒప్పంద ప్రతులు, నెలవారీ వేతన స్లిప్‌లు లేకపోవడం వల్ల కోర్టులు, ట్రిబ్యునళ్లలో తమ హక్కులను నిరూపించుకోవడం కష్టంగా మారుతోందని వివరించారు. జిల్లానుంచి విజిట్‌ వీసాలపై ఉపాధి కోసం విదేశాలకు వెళ్లడం వల్ల చట్టపరమైన రక్షణ కోల్పోయే ప్రమాదం ఉందని, నర్సింగ్‌, వైద్య రంగానికి చెందిన నైపుణ్య కార్మికులు ముందస్తు ధ్రువీకరణ లేకుండా వెళ్లడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. వలస కార్మికులకు సమస్యలు తలెత్తిన తర్వాత మాత్రమే కాకుండా, ముందస్తు అవగాహన కల్పించి మోసాలు జరగకుండా నిరోధించే వ్యవస్థను బలోపేతం చేయాలని వర్క్‌షాప్‌లో నిర్ణయించారు. బాధితులకు ఉచిత న్యాయ సహాయం అందించడంతో పాటు ఉద్యోగ ఒప్పందాలు, వేతన రికార్డులు, ఇతర కీలక పత్రాలను తప్పనిసరిగా భద్రపరుచుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement