భైంసా: కుంటాల పోలీస్‌స్టేషన్ పరిధిలోని దౌనెల్లి గ్రామానికి చెందిన పున్న మహేందర్(26) అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. మోసపూరితంగా బ్యాంకు ఖాతా నుంచి బదిలీ చేసుకున్న డబ్బు తిరిగి ఇవ్వమన్నందుకు కక్ష పెంచుకొని హత్య చేసిన మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు భైంసా ఏఎస్పీ సాయి కిరణ్ బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 18, 2026న దౌనెల్లి గ్రామ శివారులోని బావి వద్ద మహేందర్‌ను మైనర్ వెనుక నుంచి తోసివేయడంతో అతను బావిలో పడి మృతి చెందాడు. ఏప్రిల్ 23న బావిలో మృతదేహం లభించడంతో అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మహేందర్ తల్లి ఎస్పీని కలిసి తన కుమారుడి మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని కోరడంతో, ఎస్పీ ఆదేశాల మేరకు కేసును ప్రత్యేక దృష్టితో పునఃపరిశీలించారు. ఈ క్రమంలో అనుమానితుల కదలికలు, సాంకేతిక ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించి విచారణ చేపట్టారు. దర్యాప్తులో మహేందర్ బ్యాంకు ఖాతా నుంచి మైనర్ బాలుడు మోసపూరితంగా కొంత మొత్తాన్ని తన ఖాతాకు బదిలీ చేసుకున్నట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న మహేందర్ డబ్బులు తిరిగి ఇవ్వాలని నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కక్ష పెంచుకున్న మైనర్ బాలుడు మహేందర్‌ను బావి వద్దకు తీసుకెళ్లి వెనుక నుంచి తోసివేయడంతో మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. జూలై 29న మైనర్‌ను అదుపులోకి తీసుకొని తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు ఏఎస్పీ బుధవారం తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన భైంసా రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్, కుంటాల ఎస్సై నరేశ్, పోలీసు అధికారులు, సిబ్బందిని ఏఎస్పీ సాయి కిరణ్ అభినందించారు.


