ఆరు గంటల్లో కిడ్నాప్‌ కేసు ఛేదన | - | Sakshi
Sakshi News home page

ఆరు గంటల్లో కిడ్నాప్‌ కేసు ఛేదన

Jul 30 2026 12:15 AM | Updated on Jul 30 2026 12:15 AM

● ఇద్దరు మహిళలు అరెస్ట్‌ ● చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు

ఆదిలాబాద్‌టౌన్‌/తలమడుగు: కిడ్నాప్‌నకు గురైన నాలుగేళ్ల చిన్నారిని కేవలం ఆరు గంటల్లోనే గుర్తించి జిల్లా పోలీసులు మరోసారి తమ సమర్థత చాటుకున్నారు. ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ చిన్నారిని బుధవారం పోలీసు కార్యాలయంలో తల్లిదండ్రులకు అప్పగించి వివరాలు వెల్లడించారు. తలమడుగు మండలం రూయ్యడి గ్రామానికి చెందిన ఆత్రం కప్లీబాయి –జంగుల నాలుగేళ్ల చిన్నారి గంగామణిని ఈనెల 28న అదే గ్రామానికి చెందిన నైతం నాగుబాయి ఆదిలాబాద్‌ పట్టణానికి తీసుకొచ్చి, బస్టాండ్‌ ప్రాంతంలో తనకు పరిచయమున్న గుమ్మడివార్‌ భారతికి అప్పగించింది. బిడ్డ కనిపించకపోవడంతో తల్లి ఆత్రం కప్లీబాయి తలమడుగు పోలీస్‌ స్టేషన్‌లో సాయంత్రం ఫిర్యాదు చేయగా పోలీసులు కిడ్నాప్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆదిలాబాద్‌ డీఎస్పీ ఎల్‌.జీవన్‌ రెడ్డి పర్యవేక్షణలో రూరల్‌ సీఐ రహీం పాషా, రూరల్‌ ఎస్సై విష్ణువర్ధన్‌, తలమడుగు ఎస్సై రాధికతో పాటు ప్రత్యేక పోలీసు బృందాలు ఆదిలాబాద్‌, తాంసి తదితర ప్రాంతాల్లో గాలింపు చేపట్టాయి. బస్టాండ్‌లు, ప్రధాన కూడళ్లలోని సీసీ ఫుటేజీలను పరిశీలించి సాంకేతిక ఆధారాలతో అదేరోజు రాత్రి ఆదిలాబాద్‌లోని మహాలక్ష్మివాడలో చిన్నారిని గుర్తించారు. చిన్నారిని కిడ్నాప్‌ చేసిన నైతం నాగుబాయి, అలాగే చట్టవిరుద్ధంగా చిన్నారిని తన వద్ద ఉంచుకున్న గుమ్మడివార్‌ భారతిని అరెస్టు చేశారు. చిన్నారిని సురక్షితంగా రక్షించడంలో కీలకంగా పనిచేసిన రూరల్‌ సీఐ రహీం పాషా, ఎస్సైలు రాధిక, విష్ణువర్ధన్‌తో పాటు గాలింపు బృందంలోని పోలీసు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. కుమార్తె క్షేమంగా తిరిగి రావడంతో చిన్నారి తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. జిల్లా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement