బాసర: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవస్థానంలో మూడు రోజులుగా నిర్వహించిన వ్యాస పౌర్ణమి (గురుపూజ) ఉత్సవాలు బుధవారం పూర్ణాహుతితో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం వ్యాస మహర్షికి మహాభిషేకం, రుద్రాభిషేకం, బలిప్రదానం నిర్వహించారు. అనంతరం యాగశాలలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. గురు పరంపరను కొనసాగిస్తున్న మఠాధిపతులు, వేద పండితులను ఆలయ ఈవో అంజనీదేవి, స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్‌లు శాలువాలు, ఫలపుష్పాలతో ఘనంగా సత్కరించారు. ఉత్సవాల్లో భాగంగా ప్రవచనకర్త శశికాంత్ జోషి వ్యాస పౌర్ణమి వైభవం, బాసర క్షేత్ర విశిష్టతపై భక్తులకు ప్రవచనం అందించారు. అనంతరం శశికాంత్ జోషిని ఆలయ అధికారులు సత్కరించారు.
ఎమ్మెల్యే రామారావు పటేల్ పూజలు..
వ్యాస పౌర్ణమి ఉత్సవాలకు ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, మాజీ ఎమ్మెల్యే వేణుగోపాల్ చారి, భైంసా ఏఎంసీ చైర్మన్ ఆనందరావు పటేల్, సర్పంచ్ వెంకటేశ్ గౌడ్ తదితరులు హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే రామారావు పటేల్ దత్తాత్రేయ ఆలయాన్ని, శిశు మందిర్ పాఠశాలను సందర్శించారు. అనంతరం బాలాలయంలో ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు. వేద పండితులు, అర్చకులు కలిసి ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించి, ఆశీర్వచనం అందజేశారు.


