నస్పూర్: సీసీసీ సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులను పాముకాటు వేసిన ఘటన కలకలం రేపింది. కళాశాల ప్రిన్సిపాల్ రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం... కళాశాల హాస్టల్‌లో ఉంటూ చదువుకునే మెకానికల్ మొదటి సంవత్సరం విద్యార్థి ఎండీ రెహన్, సివిల్ మొదటి సంవత్సరం విద్యార్థి యశ్వంత్‌లు బుధవారం ఉదయం టిఫిన్ చేయడానికి మెస్ వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో యశ్వంత్ ఓ పాము తన కాలుపై నుంచి వెళ్లిందని అరిచాడు. పక్కనే ఉన్న ఎండీ రెహన్ పామును తరిమే ప్రయత్నం చేయగా పాము అతడిని తాకుతూ వెళ్లింది. విద్యార్థులను పాము కాటు వేసిందనే అనుమానంతో తోటి విద్యార్థులు కళాశాల సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సిబ్బంది వెంటనే 108లో విద్యార్థులను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. విద్యార్థుల ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని వైద్యులు తెలిపారని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్, మైనింగ్ హెచ్‌ఓడీలు విద్యార్థుల వెంట ఎంజీఎంలో ఉన్నారని తెలిపారు.


