మంచిర్యాలఅర్బన్: బోధన నైపుణ్యాలతో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని కలెక్టర్ కుమార్‌దీపక్ సూచించారు. శుక్రవారం జిల్లా సైన్స్ కేంద్రంలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల శిక్షణ తరగతులకు హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు కాలానుగుణంగా బోధన నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని సూచించారు. విద్యార్థులతో ప్రయోగాలు, కృత్యాధార బోధన ద్వారా అభ్యసనాన్ని తీర్చిదిద్దాలని తెలిపారు. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు పంపిణీ చేయాలని, మధ్యాహ్న భోజనం అందించాలని సూచించారు. ప్రైవేట్ పాఠశాలల నుంచి సర్కారు పాఠశాలల్లో విద్యార్థులు చేరుతున్నారని తెలిపారు. వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


