‘గ్యాస్‌’ గుది బండ! | - | Sakshi
Sakshi News home page

‘గ్యాస్‌’ గుది బండ!

Mar 12 2026 7:18 AM | Updated on Mar 12 2026 7:18 AM

● వినియోగదారులపై పెరిగిన ఆంక్షలు ● పెరిగిన ధరలు.. సరఫరాలో జాప్యం ● సరిపడా లేని కమర్షియల్‌ సిలిండర్లు ● వ్యాపారులు, శుభకార్యాలకు ఇబ్బందే..

జిల్లాలో ఎల్పీజీ కనెక్షన్ల వివరాలు

గృహావసర కనెక్షన్లు 2,59,850

కమర్షియల్‌ కనెక్షన్లు 1,475

సాక్షి ప్రతినిఽధి, మంచిర్యాల: ఇరాన్‌–అమెరియా ఇజ్రాయెల్‌ మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా జిల్లాలో ఎల్పీజీ కొరత ఏర్పడింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఫుడ్‌ బిజినెస్‌ వ్యాపారులతోపాటు ప్రతీ ఇంట్లోనూ గ్యాస్‌తో ఇబ్బంది పడే అవకాశముంది. ఇటీవల గృహావసర సిలిండర్‌ (14.02కిలోలు)పై రూ.60 పెరిగి ధర రూ.987కు చేరింది. వ్యాపారపరంగా వాడే సిలిండర్‌ (19కిలోలు)పై రూ.115 పెరిగి ధర రూ.2,200కు చేరుకుంది. వాహనాల్లో వాడే సీఎన్జీ ఫిల్లింగ్‌ స్టేషన్లలోనూ కిలోకు రూ.91చొప్పున విక్రయాలు సాగుతున్నాయి. జిల్లాలో ప్రతీనెల మొత్తం గ్యాస్‌ కనెక్షన్లలో 10 శాతం రీఫిల్లింగ్‌కు వస్తాయనే అంచనా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ముందస్తుగా నిల్వ చేసుకునేందుకు వినియోగదారులు మొగ్గు చూపడంతో ఈ సంఖ్య మరింత పెరుగుతోంది. ఇదే అదనుగా కొన్ని గ్యాస్‌ ఏజెన్సీ నిర్వాహకులు వ్యాపారులకు బ్లాక్‌లో అమ్ముకునేందుకు పక్కదారి పట్టించే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

నిలిచిన కమర్షియల్‌ సరఫరా

రెండురోజులుగా జిల్లాకు కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ల సరఫరా నిలిచింది. దీంతో హోటళ్లు, రెస్ట్రారెంట్ల నిర్వాహకులు, స్ట్రీట్‌ఫుడ్‌ వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. చాలాచోట్ల గృహావసర సిలిండర్లనే వాడుతున్నారు. వీటిని నివారించేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు కేసులు నమోదు చేసేందుకు తనిఖీలు చేస్తున్నారు. రెండురోజుల క్రితం రామకృష్ణాపూర్‌ పట్టణంలో అనధికారికంగా వాడుతున్న 12 సిలిండర్లు సీజ్‌ చేశారు.

పెరుగుతున్న ఆంక్షలు

ఎల్పీజీ ప్రధాన సరఫరాదారులైన ప్రభుత్వ రంగ హిందూస్థాన్‌, భారత్‌, ఇండేన్‌ కంపెనీలు ఇప్పటికే వాడకం, బుకింగ్‌పై ఆంక్షలు విధించాయి. వినియోగదారులు రీఫిల్‌ సిలిండర్‌ తీసుకున్నాక 21రోజులకు మరోటి పొందేలా గడువు పెట్టారు. తాజాగా మళ్లీ మరో ఐదురోజులకు పెంచి, 25రోజులకు చేశారు. ఇక రెండు ఉంటే నెలవరకు గడువు విఽధించారు. ఇలాగే సరఫరాలో అంతరాయం ఏర్పడితే సరఫరా గడువు మరింత పెరిగే అవకాశముంది. మరోవైపు గృహ వినియోగదారులూ ముందస్తుగా సిలిండర్లు బుక్‌ చేసుకుంటూ నిల్వలు పెంచుకుంటున్నారు. దీంతో బుకింగ్‌ల సంఖ్య పెరిగినట్లు ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు కమర్షియల్‌ సిలిండర్లపై ఆయిల్‌ కంపెనీలు రూ.150చొప్పున ఇచ్చే సబ్సిడీ నిలిచిపోయింది.

కట్టెల పొయ్యిలు, పొదుపుగా గ్యాస్‌

కొరతతో హోటళ్లల్లో గ్యాస్‌ వాడకంలో పొదుపు మొదలైంది. కొన్నిచోట్ల కట్టెల పొయ్యిపై వంట చేసేందుకు సిద్ధమయ్యారు. కట్టెలకు గతంలో క్వింటాల్‌కు రూ.400చొప్పున విక్రయించగా, ప్రస్తుతం రూ.800కు చేరినట్లు హోటళ్ల నిర్వాహకులు వాపోతున్నారు. ఎలక్ట్రికల్‌ కుక్కర్లు, స్ట్రీమ్‌, ఇతర ప్రత్యామ్నాయం వెతుకున్నారు. ఎక్కువగా గ్యాస్‌ అవసరమయ్యే వంటలను తగ్గిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా ఇబ్బందులు లేనప్పటికీ ఇదే తీరుగా కొనసాగితే ఫుడ్‌ బిజినెస్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని వ్యాపారాలు వాపోతున్నారు. కమర్షియల్‌ సరఫరా లేనప్పుడు గృహావసరాలకు వాడే సిలిండర్లు వాడేందుకు అనుమతివ్వాలని కోరుతున్నారు.

బ్లాక్‌ చేస్తే కఠినచర్యలు

జిల్లాలో గ్యాస్‌ సిలిండర్ల సరఫరాలో కొంత అంతరాయం ఉన్నప్పటికీ ఇంకా సరిపడా నిల్వలున్నాయి. ఇంకా ఎక్కడా కొరత ఏర్పడలేదు. ఎవరైనా చట్ట వ్యతిరేకంగా సిలిండర్ల నిల్వలు, రీఫిల్లింగ్‌ చేస్తే కఠినచర్యలు తీసుకుంటాం. – వేణుగోపాల్‌, ఏఎస్వో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement