చెన్నూర్: మహిళా సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం తొలిప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో రూ.30లక్షలతో చేపట్టిన మూడు గ్రామసమైక్య సంఘ భవనాలు, జైపూర్‌లో రూ.30లక్షలతో చేపట్టిన గోదాం నిర్మాణాలకు బుధవారం కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఇందారంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. నియోజకవర్గంలో ఒక్కో భవనానికి రూ.30లక్షల చొప్పున వెచ్చించి 35 భవనాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఇందిరా మహిళాశక్తి పథకం ద్వారా సౌర విద్యుత్ ప్లాంట్, పెట్రోల్ బంకుల నిర్వహణతో పాటు ఇందిరా శక్తి క్యాంటీన్లు, పెరటి కోళ్ల పెంపకం, ఇతర అనేక వ్యాపారాల్లో ప్రోత్సహిస్తూ మహిళలను ముందంజలో ఉంచేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. మహిళలకు వడ్డీ లేని రుణ సదుపాయం కల్పించి, బ్యాంక్ లింకేజీ రుణాల ద్వారా వ్యాపార అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రుణం పొందిన స్వయం సహాయక సంఘాలు సకాలంలో చెల్లించి తిరిగి రుణం పొంది వ్యాపారాలను వృద్ధి చేసుకోవాలని సూచించారు. మండలానికి 753 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, 200 నిర్మాణాలు స్లాబ్ దశలో ఉన్నట్లు తెలిపారు. అనంతరం 39మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి కిషన్, తహసీల్దార్ వనజారెడ్డి, ఎంపీడీవో సత్యనారాయణ, డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ ఫయాజ్, భాస్కర్, గ్రామసమైక్య సంఘాల మహిళలు పాల్గొన్నారు.


