అంతర్జాతీయ స్థాయిలో మత్స్య సంపదకు కేంద్రంగా గుడిపేట రూ.2.5 కోట్లతో 30 ఎకరాల్లో ముర్రెల్ చేపల పెంపకం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేట వద్ద గల ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సమీపంలో ముర్రెల్ క్లస్టర్ ప్రాజెక్ట్‌కు వేదిక కానుంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన(పీఎంఎంఎస్‌వై) కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు గుడిపేటలో ముర్రెల్ చేపల ఉత్పత్తి, సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు కేంద్ర మత్స్య, పశుసంవర్దక శాఖ మంత్రి రాజీవ్ రంజన్‌సింగ్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వద్ద రూ. 2.5 కోట్లతో ముర్రెల్ క్లస్టర్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం లభించినట్లు వివరించారు. ముర్రెల్ చేప అంటే రాష్ట్ర చేప కాగా దీనినే బొమ్మె, కొరమీను, కొర్రమట్ట, మట్టగిడసగా పిలుస్తూ ఉంటారు.
మత్స్యశాఖకు ఇంకా అందని స్థలం
మంచిర్యాల జిల్లా గుడిపేట శివారులో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వద్ద ముర్రెల్ క్లస్టర్ కోసం ఇంకా స్థలం మంజూరు పత్రాలు అందలేదు. ఇప్పటికే 85 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేయగా ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ ద్వారా మత్స్య శాఖకు స్థలాన్ని అప్పగించాల్సి ఉన్నా ఇంకా ఎలాంటి అనుమతులు, పత్రాలు అందలేదు. ఎంపిక చేసిన 85 ఎకరాల్లో 30 ఎకరాల్లో ముర్రెల్ క్లస్టర్ ఏర్పాటు జరగనుండగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముర్రెల్ చేపల పెంపకం, సంరక్షణ చేపట్టనున్నారు. ముర్రెల్ క్లస్టర్ ఏర్పాటుతో మత్స్యకారుల కు, మహిళా స్వయం సహాయ సంఘాలకు లబ్ధి చే కూరనుండగా ఆర్థికాభివృద్ధి దిశగా ముందుకు సాగనున్నారు. మొత్తంగా మంచిర్యాల ముర్రెల్ క్లస్టర్ రాష్ట్ర, దేశానికి తలమానికంగా నిలవబోనుంది.


