బాసర: బాసర ఆర్జీయూకేటీలో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ గోవర్ధన్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో భాగంగా మహిళా సిబ్బంది ప్రదర్శించిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వీసీ గోవర్ధన్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయ అభివృద్ధిలో మహిళా ఉద్యోగుల పాత్ర వెలకట్టలేనిదన్నారు. సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. ఓఎస్డీ ప్రొఫెసర్ ఈ.మురళీ దర్శన్ మహిళా ఉద్యోగులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ అధ్యక్షులు డా.కె.రాములు, అసోసియేట్ డీన్స్, డా.ఎం.రమాదేవి, లకుమాదేవి, బి.శ్రీవిద్య, ప్రవల్లిక, సారిక, బి.శ్వేత, శిరీష, నాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.


