మంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపాలిటీలో నస్పూరు మున్సిపాలిటీ, హాజీపూర్‌లోని ఎనిమిది గ్రామాల విలీనంతో గత ఏడాది జనవరిలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడింది. నగర పరిధి, ఉద్యోగుల సంఖ్య పెరిగింది. గతంలో 36 వార్డులతో బల్దియా ఉండగా ప్రస్తుతం 60 డివిజన్లుగా విస్తరించింది. కార్పొరేషన్‌కు ఇటీవల ఎన్నికలూ నిర్వహించగా గత నెలలో పాలకవర్గం కొలువుతీరింది. అసలు సమస్య ఇక్కడే మొదలైంది. అధికారులు, కార్పొరేటర్లు ఇరుకుగా ఉన్న కార్యాలయంతో ఇబ్బందులు పడుతున్నారు. నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారాన్ని సమావేశ మందిరంలో ఏర్పాటు చేయాల్సి ఉండగా స్థలం సరిపోదని కార్యాలయం ఆవరణలో టెంటు వేసి నిర్వహించారు. ఈ నెల 4న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘మంచిర్యాల శుభ్రత–ప్రతీ ఒక్కరి ఆరోగ్య భద్రత’ పేరిట 99 రోజుల కార్యక్రమానికి సంబంధించిన సమావేశాన్ని సైతం నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణలోనే టెంటు వేసి నిర్వహించారు. కార్పొరేషన్‌గా ఏర్పడి ఏడాది దాటగా, కొత్త పాలకవర్గం కొలువుదీరి 20 రోజులు అవుతోంది. ఇప్పటికీ కార్యాలయానికి అవసరమైన గదులు, సమావేశ మందిరం సిద్ధం కావడం లేదు.
ఆదాయం ఉన్నా వసతులు అంతంతే..
మున్సిపల్ కార్పొరేషన్‌కు పన్నులు, ప్రకటనలు, అద్దెల రూపంలోనే దాదాపుగా రూ.50 కోట్ల ఆదాయం వస్తుంది. అయినా కార్యాలయంలో పూర్తిస్థాయిలో వసతులు, కార్పొరేషన్‌కు తగినట్లుగా భవనం లేకపోవడం ఇబ్బందిగా మారుతోంది. గతంలో మున్సిపల్ చైర్‌పర్సన్‌కు మాత్రమే చాంబర్ ఉండగా, ప్రస్తుతం మేయర్, డిప్యూటీ మేయర్‌కు రెండు వేర్వేరు చాంబర్లు ఏర్పాటు చేశారు. గతంలో చైర్మన్ చాంబర్‌ను ప్రస్తుత మేయర్‌కు, కమిషనర్ చాంబర్‌ను డిప్యూటీ మేయర్‌కు కేటాయించారు. దీంతో కమిషనర్‌కు చాంబర్ లేకుండా పోయింది. ప్రస్తుతం పారిశుద్ధ్య విభాగం, మేనేజర్ కూర్చుంటున్న గదిని కమిషనర్ చాంబర్ కోసం సిద్ధం చేస్తుండగా, కమిషనర్ మాత్రం అదనపు కమిషనర్ చాంబర్‌తోపాటు సమావేశ మందిరాన్ని తన విధుల నిర్వహణకు తాత్కాలికంగా ఉపయోగిస్తున్నారు. ప్రతీ నెల పాలకవర్గం సమావేశాల నిర్వహణకు ప్రస్తుత సమావేశ మందిరం ఇరుకుగా ఉంటుంది. దీంతో పాలకవర్గ సమావేశం ఇబ్బందిగా మారనుంది. కార్పొరేషన్‌కు తగినట్లుగా భవనాన్ని నిర్మించి వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది.
ఉన్న వాటిని వినియోగిస్తాం
కార్పొరేషన్‌గా మారడంతో డివిజన్లు పెరిగాయి. మేయర్, డిప్యూటీ మేయర్ చాంబర్లకు గదుల కేటాయింపుతో కమిషనర్ చాంబర్‌ను మరోచోట ఏర్పాటు చేస్తున్నాం. సమావేశ మందిరం సమావేశాలకు వినియోగించేలా సిద్ధం చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్నవాటిని సద్వినియోగం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాం.
– అన్వేష్, మంచిర్యాల మున్సిపల్
కార్పొరేషన్ కమిషనర్


