
లారీ బోల్తాపడి డ్రైవర్ మృతి
నేరడిగొండ: బ్రిడ్జి పైనుంచి లారీ కిందపడిన ఘటనలో డ్రైవర్ మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఇచ్చోడ సీఐ రాజు తెలిపిన వివరాల మేరకు మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఐచర్ కంటైనర్ నేరడిగొండ మండలంలోని కుప్టి వంతెన వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అనువతే అనిల్ (38) క్యాబిన్‌లోనే ఇరుక్కుని మృతి చెందాడు. మృతదేహాన్ని క్రేన్ సహాయంతో బయటకు తీశారు. అతివేగంగా, అజాగ్రత్తగా నడపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని సీఐ తెలిపారు. ఎస్సై ఇమ్రాన్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.