
వాగు దాటి..కుమారుడికి వైద్యం అందించి
ఇంద్రవెల్లి: మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగు ఉప్పొంగడంతో హర్కపూర్ అంద్‌గూడ గ్రామ పంచాయతీ పరిధిలోని మామిడిగూడ ఏ, మామిడిగూడ జీ గ్రామాలకు రెండు రోజులుగా రాకపోకలు స్తంభించి పోయాయి. మంగళవారం వరద నీరు తగ్గడంతో మామిడిగూడ జీ గ్రామ పటేల్ మెస్రం గంగారాం జ్వరంతో బాధపడుతున్న తమ కుమారుడు గురుప్రసాద్‌ను భుజంపై ఎక్కించుకుని ప్రమాదకర పరిస్థితిలో వాగు దాటి ఇంద్రవెల్లి ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాడు. వాగు వద్ద కల్వర్టు నిర్మాణానికి ప్రభుత్వం రూ.3.5 కోట్ల నిధులు మంజూరు చేసినప్పటికీ పనులు ప్రారంభించకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని గ్రామస్తులు వాపోయారు. ఏటా వర్షాకాలంలో తిప్పలు తప్పడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించి వాగుపై కల్వర్టు నిర్మించాలని కోరుతున్నారు.