
‘ఖాకీ’లతో రెస్క్యూ టీమ్
90మంది కానిస్టేబుళ్లతో ఏర్పాటు ఎన్‌డీఆర్‌ఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ విపత్తుల్లో రక్షణకు ఎస్డీఆర్‌ఎఫ్
మంచిర్యాలక్రైం: ఎంతటి కఠిన సవాళ్లనైనా ఎదుర్కోవడం.. అత్యంత భయంకర పరిస్థితులకు ఎదు రు నిలబడి అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, వరదలు తదితర విపత్తుల సమయంలో ప్రజలను రక్షించేందుకు పోలీస్‌శాఖలో ఓ ప్రత్యేక టీమ్ సిద్ధంగా ఉంది. ఈ టీమ్‌లోని సభ్యులు తమ ప్రాణాలనూ లెక్క చేయకుండా ప్రమాదంలో చిక్కుకున్నవారిని సురక్షితంగా కాపాడుతారు. గతేడాది జరిగిన విపత్తులను దృష్టిలో ఉంచుకుని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా, కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఎగ్గ డి భాస్కర్ చర్యలు చేపట్టారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) ఆధ్వర్యంలో కమిషనరేట్ పరిధిలోని ఒక్కో పోలీస్‌స్టేషన్ నుంచి మెరికల్లాంటి 90మంది కానిస్టేబుళ్లను ఎంపిక చేశారు. వా రికి వారంపాటు హైదరాబాద్‌లోని నాగోల్‌లో ప్ర త్యేక శిక్షణ ఇచ్చి టీమ్‌ను తయారు చేశారు.
గత అనుభవాల దృష్ట్యా..
గతేడాది వరుసగా కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో అనేక మారుమూల గ్రామాలు నీట మునిగి ప్రజలు అష్టకష్టాల పాలయ్యారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌నగర్, పద్మశాలీకాలనీ, రెడ్డికాలనీ, రాళ్లపేట, రాంనగర్, ఎల్‌ఐసీ కాలనీలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. నీట మునిగి ఏడాది గడిచినా బాధితులు నష్టాల నుంచి తేరుకోకముందే ఈసారి మళ్లీ అదే పరిస్థితి ఎదురైంది. సుమారు ఒక్కో కుటుంబానికి రూ.3లక్షల వరకు నష్టం జరిగింది. వీరికి అప్పటి ప్రభుత్వం కూడా ఎలాంటి సాయం అందించలేదు. ఎప్పుడు వర్షాకాలం వచ్చినా జిల్లా ప్రజల్లో వణుకు మొదలవుతోంది. గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో పా టు ఎగునున్న సుందిళ్ల, ఎల్లంపెల్లి ప్రాజెక్ట్‌ల్లోకి భారీగా నీరు చేరడంతో బ్యాక్ వాటర్, గోదావరి ప్రవాహానికి తోడు, పలు కాలువలు, వాగుల నుంచి వచ్చే వరదలతో మంచిర్యాల పట్టణంలోని పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి. బాధిత ప్రజ లను కాపాడేందుకు స్థానిక పోలీసులు, మున్సిపల్ సిబ్బంది ఎంతో శ్రమించారు. ప్రస్తుతం చినుకు పడితే తమ గూడు చెదిరిపోతుందనే భావనలో ఎన్నో కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ కాలం వె ల్లదీస్తున్నాయి. గతంలో రెండుసార్లు సంభవించిన ముంపులో భారీ నష్టాన్ని ప్రజలు చవిచూశారు.
ప్రజల రక్షణే ప్రధాన లక్ష్యం
ప్రజలను కాపాడేందుకు ప్రత్యేక రెస్క్యూ టీమ్‌ను ఏర్పాటు చేశాం. మెరికల్లాంటి కానిస్టేబుళ్లను ఎంపిక చేసి కఠోర శిక్షణ ఇప్పించాం. వరదలు, ప్రయాణాల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నవారు ‘డయల్ 100’కు కాల్ చేస్తే చాలు స్థానిక పోలీసులు గాని రెస్క్యూ టీమ్ సభ్యులు గాని వెంటనే స్పందించి రక్షణ కల్పిస్తారు. విపత్తులు సంభవించినప్పుడు అధైర్యపడవద్దు. వానాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విపత్తుల సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడడమే లక్ష్యంగా ఫ్లడ్ రెస్క్యూ టీమ్‌ను ఏర్పాటు చేశాం.
– ఎగ్గడి భాస్కర్, మంచిర్యాల డీసీపీ
ఎలా పని చేస్తారంటే..
రామగుండం కమిషనరేట్ పరిధిలో ఏర్పాటైన రెస్క్యూ టీమ్ కమిషనర్ పర్యవేక్షణలో పని చేస్తుంది. ప్రజలు ఎక్కడైనా ప్రమాదంలో చిక్కుకున్నారంటే స్థానిక పోలీస్‌స్టేషన్‌కు గాని లేదా ‘డయల్ 100’కు కాల్ చేసి సమాచారం అందిస్తే వెంటనే అక్కడికి పోలీస్ రెస్క్యూ టీమ్ చేరుకుంటుంది. సాంకేతిక ప రిజ్ఞానం, అత్యాధునిక పరికరాల ఆధారంగా ప్రమాదంలో ఉన్న వారిని టీమ్ సభ్యులు ప్రాణాలతో కాపాడేందుకు ప్రయత్నిస్తారు. ఎక్కడైనా రాకపోకలు నిలిచిపోయే విధంగా చెట్లు పడిపోయినా, రోడ్లు, బ్రిడ్జీలు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయినా, వరదలతో కాలనీల్లోకి నీరు చేరి ప్రజలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయినా వారిని కాపాడుతారు. వివిధ ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఈ రెస్క్యూ టీమ్ సభ్యులు తమ ప్రాణాలనూ లెక్క చేయకుండా ప్రజలను రక్షిస్తారు. కమిషనరేట్ పరిధిలో 30మంది టీమ్‌తో కూడిన మూడు టీమ్‌లు 24గంటలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి.