
గుండేగాంలోకి మళ్లీ నీళ్లు..
భైంసా/భైంసారూరల్: ఇటీవల కురుస్తున్న వర్షాలకు గుండేగాం వాసుల్లో మళ్లీ భయం పట్టుకుంది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గుండేగాం వంతెన నీట మునిగింది. వంతెనతోపాటు గ్రామాన్ని సోమవారం ఎస్పీ జానకీ షర్మిల సందర్శించా రు. గ్రామస్తులతో మాట్లాడి ఏ అవసరం వచ్చినా మేమున్నామని భరోసా కల్పించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం నిర్మల్ జి ల్లాకు రానున్నారు. మంత్రి ఈ సమస్యకు పరి ష్కారం చూపుతారన్న ఆశ గ్రామస్తుల్లో నెలకొంది.
సర్వే పూర్తయినా...
గత ప్రభుత్వహయాంలో గుండేగాం పునరావాసం సర్వే పూర్తి చేశారు. రూ.200 కోట్లకుపైగా నిధులు అవసరమని అధికారులు ప్రతిపాదించారు. భైంసా మండలం సిద్దూర్ శివారుల్లో సర్వేనంబర్ 73లో మూడెకరాల భూమి గుర్తించి అందులో పునరావాసం కల్పిస్తామన్నారు. ఏళ్లు గడుస్తున్నా ఇళ్ల స్థలాలకు సంబంధించిన నమూనాలు పూర్తికాలేదు. గత ప్రభుత్వహయాంలో పునరావాసం కోసం రూ.66 కోట్లు అవసరమని మరో ప్రతిపాదన పంపించారు. ఈ నిధులు సరిపోవంటూ మరో రూ.33 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదించారు. ఇలా పలుమార్లు ఇచ్చిన నివేదికలన్నీ ప్రభుత్వం వద్దే మగ్గుతున్నాయి. ఫలితంగా ఏటా వానాకాలం ఈ గ్రామానికి గండంగా మారుతోంది. వర్షాలు కురిస్తే నీరంతా గ్రామంలోకి వచ్చి చేరుతోంది.
డబుల్‌బెడ్‌రూం ఇళ్లలోనే...
రెండేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలతో రెవెన్యూ అధికారులు కమలాపూర్ గుట్ట సమీపంలో ఏర్పాటు చేసిన డబుల్ బెడ్‌రూం ఇళ్లలోనే ఇప్పటికీ గుండేగాం వాసులు ఉంటున్నారు. ప్రతీరోజు అక్కడి పంట పొలాల్లో పనిచేసుకుని సాయంత్రానికి ఇక్కడికే తిరిగివస్తున్నారు.
ఇదీ పరిస్థితి...
వాడి గ్రామ సమీపంలో సుద్దవాగుపై 2005లో రూ.12కోట్ల వ్యయంతో రంగారావు పల్సికర్ ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్టు ద్వారా 12 గ్రామాలకు చెందిన 4,600 ఎకరాలకు సాగునీరందించేలా పనులు చేపట్టారు. కోతల్‌గాం, బిజ్జూర్, ఎగ్గాం, మాటేగాం, హంపోలి, బోరిగాం, వాడి, బాబుల్‌గాం, భైంసా, హజ్గుల్, వానల్‌పాడ్, వాటోలి గ్రామాలకు చెందిన 1800 మంది రైతుల సాగు భూములకు నీరందేలా కాలువలు తవ్వారు. 2006లో ఈ పనులు దక్కించుకున్న కాంట్రాక్టరు అర్ధాంతరంగా వదిలేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రాజెక్టు నిర్మాణ నిధులు రూ.25 కోట్లకు పెంచి పనులు ప్రారంభించారు. 2006 నుంచి ఇప్పటి వరకు ప్రాజెక్టు పనులు పూర్తికాక అటు పునరావాసం కల్పించక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు ప్రాజెక్టు కింద తవ్విన కాలువలన్నీ కూరుకుపోయాయి.
ఇబ్బంది పడుతున్నాం
వర్షాకాలంలో ఇబ్బంది పడుతున్నాం. వర్షం కురిస్తే నీళ్లన్నీ గ్రామంలోకి వస్తున్నాయి. వాగు పక్కన నిలిచిన నీరంతా శ్మశాన వాటికను ముంచేస్తోంది.
– అంశబాయి, గ్రామస్తురాలు
పునరావాసం కల్పించాలి
ఇటీవల కురుస్తున్న వర్షాలకు గుండేగాం వాగు పక్కన నీరు నిలిచిపోయింది. ఎటుచూసినా నీరే ఉంది. అధికారులు గుండేగాం వాసులకు పునరావాసం కల్పించాలి.
– సురేశ్, గ్రామస్తుడు