
ఛాయాచిత్రం.. స్మృతుల సజీవ సాక్ష్యం
మధుర స్మృతులు.. కలకాలం పదిలం.. ఫొటోలు శాశ్వతం... గతం తీపి గుర్తుల జ్ఞాపకం నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం
మంచిర్యాలరూరల్(హాజీపూర్):ఫొటోగ్రఫీ ప్రకృతి అందాలు, పసిపాపల నవ్వులు, జీవితంలోని ప్రతీ మలుపును శాశ్వతంగా నిలిపే కళ. నలుపు–తెలుపు యుగం నుంచి డిజిటల్ కాలం వరకు, ఫొటోలు భావాలకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయి. ప్రకృతి సౌందర్యం, శుభకార్యాలు, ప్రళయాలు, విధ్వంసాలు అన్నింటినీ ఒడిసిపట్టే ఛాయాచిత్రాలు సామాజిక మార్పులకు ఆధారం. ఆగస్టు 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఈ కళ గురించి ప్రత్యేక కథనం.
ఫోటోగ్రఫీ పుట్టుక
‘ఫోటోస్’ (కాంతి), ‘గ్రాఫ్’ (రాయడం) అనే గ్రీకు పదాల నుంచి ఫొటోగ్రఫీ ఉద్భవించింది. 1839లో ఫ్రాన్స్‌కు చెందిన ఎల్.జె.ఎం.డ్యాగురే తొలి ఛాయాచిత్రాన్ని సెన్సార్ అయోడైజ్డ్ ద్వారా బంధించగా, ఫ్రాన్స్ సైన్స్ అకాడమీ ఆగస్టు 19ను ప్రపంచ ఫొటోగ్రఫీ దినంగా ప్రకటించింది. 1889లో జార్జ్ ఈస్ట్‌మన్ కొడాక్ బాక్స్ కెమెరాను రూపొందించాడు. మాన్యువల్ నుంచి డిజిటల్ కెమెరాల వరకు, ఇప్పు డు స్మార్ట్‌ఫోన్ సెల్ఫీలు ఫొటోగ్రఫీని మార్చేశాయి.
సాంకేతిక మార్పులు
తెలంగాణ రాష్ట్ర ఫొటో, వీడియో గ్రాఫర్స్ సంఘం, ఆల్ ఇండియా ఫొటో ఇండస్ట్రీ వంటి సంస్థలు ఎగ్జిబిషన్‌ల ద్వారా డిజిటల్ కెమెరాలు, ప్రింటర్లను పరిచయం చేస్తూ శిక్షణ ఇస్తున్నాయి. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఛాయాచిత్ర పోటీలు నిర్వహిస్తూ బహుమతులు అందిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు, వీడియోలు విప్లవం సృష్టిస్తుండగా, స్టూడియోల గిరాకీ తగ్గింది.