
అనారోగ్యంతో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ మృతి
దండేపల్లి: మండలంలోని మేదరిపేటకు చెందిన జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ మర్రి ప్రవీణరెడ్డి (71) అనారోగ్యంతో మృతి చెందింది. 2000 సంవత్సరంలో టీడీపీ నుంచి దండేపల్లి జెడ్పీటీసీగా గెలుపొందిన ఆమె 2005 వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్‌గా పనిచేశారు. అంతేకాకుండా సుమారు 40 ఏళ్ల నుంచి మేదరిపేటలో ప్రైవేట్ నర్సింగ్‌హోం నిర్వహిస్తున్నారు. ఏడాది క్రితం క్యాన్సర్ బారిన పడింది. నెల రోజులుగా హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించి సోమవారం మృతి చెందింది.
జాతీయస్థాయి వర్క్‌షాప్‌కు జిల్లా ఉపాధ్యాయుడు
నిర్మల్‌ఖిల్లా: నూతన జాతీయ విద్యావిధానం అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం జాతీయస్థాయి వర్క్‌షాప్‌ను నిర్వహించనుంది. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి పదిమంది ఉపాధ్యాయులకు స్థానం దక్కగా అందులో నిర్మల్ జిల్లా భైంసా మండలం వానల్‌పాడ్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు మేదరి ఎల్లన్నకు అవకాశం లభించింది. ఈనెల 27 నుంచి సెప్టెంబర్ 10 వరకు రాజస్థాన్ రాష్ట్రంలో నిర్వహించనున్న వర్క్‌షాప్‌లో పాల్గొననున్నారు. ఈ మేరకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జి.రమేశ్ ఉత్తర్వులు వెలువరించారు.
ఉద్యోగాల పేరుతో మోసగించిన ఒకరి అరెస్టు
బోథ్: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అమాయకులను మోసగించి డబ్బులు వసూలు చేసిన మామిడాల సతీశ్‌ను సోమవారం అరెస్టు చేసినట్లు సీఐ వెంకటేశ్వరరావు. ఎస్సై శ్రీసాయిలు తెలిపారు. కరీంనగర్ జిల్లాకు చెందిన సతీశ్, రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.5.50 లక్షలు వసూలు చేశాడని బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
పేకాడుతున్న నలుగురు..
సాత్నాల: పేకాట ఆడుతున్న నలుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై గౌతమ్ పవర్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు సోమవారం భోరజ్ మండలం గిమ్మ గ్రామంలో దాడులు నిర్వహించగా పేకాడుతున్న మండ అడెల్లు, మాదాస్తు పవన్, మునిగల భూమన్న, గడసందుల భూమయ్యను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుండి రూ.6,600 నగదు, రెండు ఫోన్లు, స్కూటీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.