
చినుకు.. వణుకు!
చిన్నపాటి వర్షానికే జలమయమవుతున్న నగరం ఇళ్లల్లోకి చేరుతున్న వరద నీరు డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తం మార్కెట్ ఏరియాల్లోనూ దుకాణాల్లోకి వరద నీరు ముంపు గండం గట్టెక్కేదెలా?
మంచిర్యాలటౌన్: మంచిర్యాల కార్పొరేషన్‌గా పేరుమారినా మౌలిక సదుపాయాలు మాత్రం ప్రజలకు ఏమాత్రం అందడంలేదు. చిన్నపాటి వర్షానికే వరద నీరు రోడ్లపై, ఇళ్ల మధ్యనే నిలుస్తోంది. గంటపాటు ఏకధాటిగా వర్షం కురిస్తే జనం ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి. డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, ఉన్నచోట పూడిక తీయక పోవడం, చెరువు మత్తడి కాలువలతో పాటు, డ్రెయినేజీ కాలువను కబ్జా చేసి ఇళ్ల నిర్మాణాలను చేపట్టడం వరద నీటిలో కాలనీలు మునిగేందుకు కారణమవుతున్నాయి. మున్సిపాలిటీగా ఉన్నప్పుడు డ్రెయినేజీ వ్యవస్థను పట్టణ జనాభా, వరద నీరు పారేలా నిర్మాణం చేపట్టాల్సి ఉండగా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఫలితంగా ఏటా వర్షాకాలంలో పట్టణంలోని సగం కాలనీలు వరద నీటిలో మునిగి పోతున్నాయి. భారీ వర్షాలు కురిస్తే వరద నీరు ఇళ్లల్లోకి చేరి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. శుక్రవారం ఉదయం కురిసిన వర్షానికి పట్టణం మొత్తం వరద నీటితో నిండిపోయి రోడ్లపై వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది.
బృందావనం కాలనీలో రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు
చిన్నపాటి వర్షానికే..
జిల్లా కేంద్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షానికి బృందావనం కాలనీ, సూర్యనగర్, చున్నంబట్టివాడ కాలనీల్లో రోడ్లు వరద నీటిలో మునిగిపోయాయి. రోజంతా రోడ్లపై వరద నీరు నిలిచి ఉండడంతో వాహనదారులు, పాదచారులు బయటకు వెళ్లలేని పరిస్థితి. హమాలివాడకు వెళ్లేందుకు ఉన్న రెండు రైల్వే అండర్ బ్రిడ్జిల్లోకి వచ్చే వరద నీటిని బయటకు పంపిస్తుండగా అవి నేరుగా సూర్యనగర్ కాలనీలోని డ్రెయినేజీల్లోకి చేరుతున్నాయి. డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో రోడ్లపై పారుతున్నాయి. దొరగారిపల్లె నుంచి వచ్చే వరద నీరు, పోచమ్మ చెరువు మత్తడి కాలువలోని నీరు సైతం బృందావనం కాలనీ, సూర్యనగర్, చున్నంబట్టి కాలనీల్లోకి చేరి అక్కడి రోడ్లను ముంచెత్తుతున్నాయి. వరద నీటిని బయటకు పంపించేందుకు మార్గం లేక పోవడంతో ఏటా నీటిలోనే ఆయా కాలనీలు ఉంటున్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు ప్రజలు బయటకు వచ్చే పరిస్థితులు లేకపోవడంతో ఇబ్బందిగా మారుతోంది. పాతమంచిర్యాల నుంచి రంగంపేట్ వెళ్లే వంద ఫీట్ల రోడ్డు పక్కన డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షపు నీరు రోడ్లపై పారుతూ సమీపంలోని శ్రీలక్ష్మీనగర్ కాలనీకి చేరుతుంది. ఈ ప్రాంతంలో డ్రెయినేజీల నిర్మాణం చేపట్టి వరద నీరు బయటకు వెళ్లేలా చేస్తే కాలనీలోకి వరద నీరు రాకుండా ఉండేందుకు అవకాశం ఉంది. ఐబీ చౌరస్తా నుంచి శ్రీనివాస థియేటర్‌కు వెళ్లే దారిలో డ్రెయినేజీని నిర్మించక పోవడం, ఒకవైపు మాత్రమే డ్రెయినేజీ ఉండడంతో కాలనీలోని ఇళ్లల్లోకి వరద నీరు చేరి ఇబ్బందిగా మారుతోంది. హైటెక్‌సిటీ కాలనీలో డ్రెయినేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారడంతో వర్షపు నీరు బయటకు వెళ్లలేని పరిస్థితి. దీంతో కాలనీలోని రోడ్లు, ఇళ్ల మధ్య వరద నీరు చేరుతోంది. బృందావనం కాలనీ, సూర్యనగర్, చున్నంబట్టి వాడ, శ్రీలక్ష్మీనగర్ కాలనీ, వికాస్‌నగర్, తిలక్‌నగర్, రాజీవ్‌నగర్, పాతమంచిర్యాల, సాయికుంట, శ్రీనివాస కాలనీ, హైటెక్‌సిటీ కాలనీ, హమాలివాడ, ఐబీ చౌరస్తా, రాంనగర్, ఎన్టీఆర్‌నగర్ కాలనీల్లో డ్రెయినేజీ వ్యవస్థను సరిచేయడమో, వరద నీరు వెళ్లేలా నిర్మాణం చేయడమో చేస్తేనే నగరంలో వరద నీరు రోడ్లపై చేరకుండా ఉండేందుకు అవకాశం ఉంది.

చినుకు.. వణుకు!

చినుకు.. వణుకు!