మంచిర్యాలటౌన్: విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు వారికి చేరవేయాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపై ఉందని జిల్లా పరిశీలకులు, తెలంగాణ మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసచారి అన్నారు. జిల్లా కేంద్రంలోని డీసీఈబీ కార్యాలయంలో గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్యతో కలిసి జిల్లాలోని అన్ని మండలాల ఎంఈవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు, నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్, తాగునీటి సౌకర్యం, ప్రహరీ నిర్మాణాలు, మధ్యాహ్న భోజనం, స్కాలర్‌షిప్స్ అందేలా చూడాలన్నారు. ఆయా కార్యక్రమాలను విజయవంతం చేయడంలో అత్యంత ముఖ్యమైన పాత్ర మండల విద్యాశాఖ అధికారులదేనన్నారు. అనంతరం డీఈవో మాట్లాడుతూ ఎంఈవోలు రోజుకు రెండు పాఠశాలలను తప్పనిసరిగా సందర్శించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయ సూపరింటెండెంట్ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.