
విద్యారంగానికి నిధులేవి..?
మంచిర్యాలఅర్బన్: ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు బడ్జెట్‌లో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయించడం లేదని పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజ్ ప్రశ్నించారు. మంచిర్యాల మార్క్స్ భవన్‌లో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్రస్థాయి రాజకీయ శిక్షణ తరగతులకు సంబంధించిన కరపత్రం ఆదివా రం ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తూ కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలకు కొమ్ముకాస్తోందన్నారు. విద్యారంగ సమస్యలు చెప్పుకోవడానికి కనీసం విద్యాశాఖ మంత్రిని నియమించలేదని విమర్శించారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్‌మెంట్, కాస్మొటిక్ చార్జీ లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా డీఈవో, ఎంఈవో, టీచర్ పోస్టులు భర్తీ చేయాలన్నారు. నూతన జాతీయ విద్యావిధానాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని సూచించారు. ఆగస్టు 23, 24 తేదీల్లో మంచిర్యాలలో నిర్వహించే విద్య, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, సహయ కార్యదర్శి తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు సికిందర్, రాజ్‌కుమార్, వంశీ తదితరులు పాల్గొన్నారు.