
ఆశాజనకంగా పత్తి
బెల్లంపల్లి: బెల్లంపల్లి నియోజకవర్గంలో పత్తి పంట ఆశాజనకంగా సాగవుతోంది. మొన్నటి వరకు వర్షాలు లేకపోవడంతో ప్రతికూల పరిస్థితులు ఏర్పడగా, ఇటీవల అడపాదడపా వర్షాలు కురుస్తుండటంతో అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. నియోజకవర్గంలో భీమిని, బెల్లంపల్లి రెండు వ్యవసాయ డివిజన్లు ఉండగా వీటి పరిధిలో దాదాపు 60 వేల ఎకరాల్లో పత్తి సాగుచేస్తున్నారు. ఇటీవలి వర్షాలకు భీమిని, కన్నెపల్లి, నెన్నెల, బెల్లంపల్లి, వేమనపల్లి, తాండూర్ మండలాల్లో అక్కడక్కడా చీడపీడలు, తెగుళ్లు ఆశిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. రేగడి నేలల్లో నీటితడి ఆరకపోవడం, లోతట్టు ప్రాంతాల్లో సాగు చేసిన పంటలు నీట మునగడం కూడా పంటలను ప్రభావితం చేస్తున్నాయి. భా రీ వర్షాలు లేక పోవడంతో పంట నష్టం ఈసారి బాగా తగ్గిందని వ్యవసాయ అధికారులు పే ర్కొంటున్నారు. తెగుళ్ల నివారణ కోసం క్రిమి సంహారక మందులు పిచికారీ చేస్తుండడంతో చీడపీడల బెడద కాస్తా తగ్గిందని తెలిపారు.