
రావమ్మా మహాలక్ష్మి..!
● నేడు వరలక్ష్మివ్రతం ● అష్టైశ్వర్యాలకు వరం ● సౌభాగ్యాలు, సిరి సంపదలు కలుగుతాయని ప్రతీక
కెరమెరి(ఆసిఫాబాద్): నేడు శ్రావణ శుక్రవారం.. మహిళలకు ఈ వారం అత్యంత శ్రేష్టమైనది. ఈ వ్రతాలను నిండు మనస్సుతో చేసేవారికి సకల సౌభాగ్యాలు, పుత్రప్రాప్తి కలిగి సుఖంగా ఉంటారని విశ్వాసం. మహాలక్ష్మిని వరలక్ష్మి పేరుతో అర్చించడం మన సంప్రదాయం. ఈరోజు ఇళ్లను శుభ్రపర్చి, ముంగిట ముగ్గులతో అలంకరించి కలశాన్ని ఏర్పర్చి పూజలు నిర్వహిస్తే సిరి సంపదలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. అయితే వరలక్ష్మి వ్రతం గురించి వివిధ కథలు, పురాణాలు, ప్రాచుర్యంలో ఉన్నాయి. దీనిపై సాక్షి అందిస్తున్న కథనం.
పూజా విధానం..
ఓం శ్రీ వరలక్ష్మిదేవ్యైనమః ఆచమ్య ఓం కేశవాయస్వాహా, ఓం నారాయణ స్వాహా, ఓం మాధావాయాస్వాహా అని జలము తీసుకోవాలి. ప్రాణాయామం జపించాలి, పుష్పాంక్షతలు పట్టుకుని సంకల్పం చెప్పాలి. పుష్పంతో కలశంలోని పూజ వస్తువులు, దేవునిపై, తనపై చల్లుకోవాలి.
మంటపం తయారు చేయాలి
మంటపం మాదిరిగా తయారు చేసి అందులో వరలక్ష్మి ఫొటో పెట్టి, అలంకరణం చేయాలి. పటం ముందు ఒక కొత్త తెలుపు వస్త్రం పర్చాలి. బియ్యం పోసి తమలాపాకులు ఉంచి, కలశాన్ని గంధం కుంకుమలతో అలంకరించాలి. అనంతరం పూజ ప్రారంభించాలి.
వైభవ లక్ష్మి అవతారాలు..
ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి.
అనుగ్రహాలు పొందాలి..
రాక్షసుల గురువు శుక్రాచార్యుడు. ఈ శుక్రాచార్యుల పేరుపై శుక్రవారం ఏర్పడిందని హిందు పురాణాలు చెబుతున్నాయి. శుక్రచార్యుని తండ్రి బృగుమహార్శి. బ్రహ్మదేవుని సంతానంలో ఒకరు. ఇతను లక్ష్మిదేవికి తండ్రి కూడా. అందుకే లక్ష్మిదేవికి భార్గవి అని పేరు. ఈవిధంగా లక్ష్మిదేవికి శుక్రాచార్యుడు సోదరుడు. అందుకు శుక్రవారమంటే ఆమెకు ఎంతో ప్రీతికరమైనది. లక్ష్మిదేవి రూపురేఖలో, వస్త్రాధారణలు, రంగులకు ప్రాధాన్యం ఉంది. లక్ష్మిదేవి ఎక్కువగా ఎరుపు, ఆకుపచ్చ రంగులు ధరించినట్లు చిత్రాలు చిత్రిస్తారు. ఎరుపు రంగుశక్తికి, ఆకుపచ్చ సాపల్యతకు, ప్రకృతికి చిహ్నాలు, ప్రకృతికి లక్ష్మిదేవి ప్రతినిధి. లక్ష్మిదేవి ధరించే బంగారు ఆభరణాలు బంగారం ఐశ్వర్యానికి సంకేతం. విష్ణు ఆరాధనలో లక్ష్మిపూజకు ప్రాధాన్యం ఉంది. లక్ష్మిదేవి అనుగ్రహంతో కాని విష్ణుమూర్తిని దరిచేరలేం. లక్ష్మిప్రసన్నత లేకుండా విష్ణువు భక్తులకు అందుబాటులో ఉండరు. సదాచారం, సత్ప్రవర్తన లక్ష్మిదేవికి ఆహ్వానాలు. ఈ రెండు ఉంటే లక్ష్మిదేవి, విష్ణుమూర్తి అనుగ్రహాలు పొందవచ్చు.
వరలక్ష్మి పూజ అత్యంత శ్రేష్టం..
ఆనాటి నుంచి నేటి వరకు వివిధ గ్రామాల్లో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కొనసాగుతుంది. వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించేందుకు మహిళలు ఆలయాలకు చేరుకుంటారు. మహిళలు వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తే అత్యంత శ్రేష్టమని భావించి పూజ నిర్వహిస్తారు.
శుక్రవారమే లక్ష్మి ఆరాధన ఎందుకు?
లక్ష్మిదేవిని గురు, శుక్రవారాల్లో ప్రత్యేకంగా పూజిస్తారు. ఈరోజుల్లో దేవిని ప్రసన్నం చేసుకుని ఆమె ఆశీస్సులు పొందేందుకు వ్రతాలు చేస్తారు. లక్ష్మిదేవికి ప్రీతికరమైన స్త్రోత్రాలు, స్తుతులు పాటిస్తారు. ఆ రోజు నుంచి కొంతమంది ఉపవాసం ఉంటారు. ఈ నాడు మానవులే కాదు, పురాణాల్లో రాక్షసులు కూడా శుక్రవారం లక్ష్మిదేవిని పూజించేవారనడానికి ఎన్నో కథలున్నాయి. అసలు శుక్రవారమే లక్ష్మిదేవికి ఎందుకు అనుకూలమైన దినంగా పేరు గాంచింది? అందులో రాక్షస సంహారి అయినా విష్ణుమూర్తి భార్యను రాక్షసులు కొలవడమేమిటి అనే సందేహాలు అనేకుల్లో ఉన్నాయి.