
దూది గొండలే ప్రత్యేకం
● భైంసాలో నేటికి అవే.. ● రాఖీ పౌర్ణమికి ముందుగానే ఇంటింటా పంపిణీ
భైంసా: అక్కాతమ్ముళ్ల అనురాగానికి, అన్నాచెల్లెళ్ల ఆత్మీయతకు ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి సందర్భంగా భైంసా ప్రాంతంలో పూజార్లు, అర్చకులు ఇంటింటా ఇప్పటికీ దూది గొండలే ఇస్తారు. ఈ ప్రాంతం మహారాష్ట్రకు ఆనుకుని ఉండడంతో రాఖీలను గొండలు అని పిలుస్తారు. సన్నని దారానికి దూదిని పసుపులో, కుంకుమలో, చంద్రం, గులాలు ఇలా పూజకువాడే వాటిలో కలుపుతారు. ఇలా కలిపిన దూది నుంచి దారాన్ని బయటకు తీసి గొండగా కడుతారు. ఇలా తయారు చేసిన గొండలను గ్రామాల్లో ముందుగా అక్కడి పూజార్లు ప్రత్యేక పూజలు చేస్తారు. పౌర్ణమికి రెండు రోజుల ముందుగానే ఇంటింటికి వెళ్లి ఈ దూదిగొండలను పంచిపెడతారు. ఇవి తీసుకున్నవారు ఇంటికివచ్చిన పూజార్ల కాళ్లు కడిగి వారిని లోనికి ఆహ్వానిస్తారు. ఇచ్చిన దూదిగొండలు తీసుకుని ఇంట్లో పండించిన బియ్యం, జొన్నలు, పప్పులు దానం చేస్తుంటారు. రాఖీపౌర్ణమి రోజున ఇంటికి వచ్చే ఆడపడుచులు పూజార్లు ముందుగా ఇచ్చిన ఈ దూదిగొండలనే కడతారు.
ఆడపడుచులకు పుట్టింటి కానుకలు
తోబుట్టువులకు దూదిగొండలు చేతికి కట్టగానే కానుకలు అందిస్తారు. సోదరులు పుట్టింటి ఆడపిల్లకు కాళ్లు మొక్కి నగదు, బట్టలు కానుకగా ఇస్తుంటారు. రాఖీ పౌర్ణమి నుంచి పొలాల అమావాస్య వరకు 15 రోజులపాటు వీలు దొరికినప్పుడల్లా దూరప్రాంతంలో ఉండే పుట్టింటి ఆడపడుచు ఎప్పుడైనా వచ్చి తోబుట్టువులకు రాఖీలు కట్టి వెళ్తుంది. రాఖీ పౌర్ణమి అంటే ఇక్కడి వారు ప్రత్యేకంగా భావిస్తారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆడపిల్లలు పుట్టింటికి రావడం భైంసా చుట్టుపక్కల ఇప్పటికీ ఆనవాయితే. నాగుల పంచమి, రాఖీ పౌర్ణమి వెంటవెంటనే వచ్చే ఈ రెండు పండుగలకు ఆడపిల్లలు తప్పకుండా పుట్టింటికివస్తుంటారు. చేతికి రాఖీ కట్టిన వెంటనే ఆడపిల్లకు కాళ్లు మొక్కి ఆశీర్వాదాలు తీసుకుంటారు. చేతికిరాఖీ కట్టి నోరు తీపిచేసి తోబుట్టువులను ఆశీర్వదిస్తారు.
సంఘాల ఆధ్వర్యంలో..
ఇంట్లో రాఖీ పౌర్ణమి సందర్భంగా తోబుట్టువులతో పండుగ చేసుకున్న అనంతరం అంతా బయటకు వస్తారు. సంఘాల ఆధ్వర్యంలో సామూహికంగా రాఖీ పౌర్ణమి వేడుకలు జరుపుకుంటారు. ప్రతి పల్లెటూరిలోనూ ఈ వేడుకలు వైభవంగా జరుగుతాయి. హిందువాహిని, ఆర్‌ఎస్‌ఎస్‌లతోపాటు సరస్వతీ శిశుమందిరాల విద్యార్థులు భైంసా డివిజన్‌లోని అన్ని ప్రాంతాలకు వెళ్లి రాాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. భైంసాలో విధుల్లో ఉండే పోలీసులు, ఆర్టీసీ డ్రైవర్లు, ఆసుపత్రి సిబ్బంది, అత్యవసర సేవలు అందించేవారికి భైంసావాసులు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలుపుతారు.