
● చించోలి(బి)కి చెందిన యువకుడు ● 16 ఏళ్ల వయస్సులో మతిస
22 ఏళ్ల తర్వాత ఇంటికి..●
సారంగపూర్: 16 ఏళ్ల వయస్సులో మతిస్థిమితం లేక ఇంటి నుంచి వెళ్లిన యువకుడు 22 ఏళ్ల తర్వాత తిరిగివచ్చాడు. స్థానికులు, హైదరాబాద్‌లోని స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తెలిపిన వివరాలు.. మండలంలోని చించోలి(బి) గ్రామానికి చెందిన గొల్ల నడిపి లింగయ్య గత 34 ఏళ్ల క్రితం దుబాయ్‌కి వెళ్లాడు. అప్పటికే ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇందులో చిన్నకుమారుడు మల్లయ్య చిన్నతనం నుంచే మతిస్థిమితం లేకుండా బయట తిరుగుతూ ఉండేవాడు. అతనికి 16 ఏళ్ల వయస్సులో ఎక్కడికో వెళ్లిపోయాడు. తల్లి మల్లవ్వ, అక్కలు, అన్నయ్య ఆతని కోసం వెతికిన ఆచూకీ దొరకలేదు. ఆయన సోదరుడు ఇటీవల మృతి చెందాడు. ఈక్రమంలో ఆకస్మాత్తుగా హైదరాబాద్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థకు ఇటీవల సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో సద రు యువకుడు మల్లయ్య (38) కనిపించాడు. తన కుటుంబ వివరాలు తెలపడంతో ఆదివారం చించోలి(బి) గ్రామానికి తిరిగి తీసుకువచ్చి కుటుంబీకులకు అప్పగించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. కుటుంబీకుల ఆధ్వర్యంలో అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్లు సమాచారం.