ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య
సాత్నాల: ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుందరగిరి గ్రామానికి చెందిన కొక్కుల లచ్చన్న(52) కొంతకాలంగా తమకున్న మూడెకరాలతోపాటు మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకుని కొన్నేళ్లుగా వ్యవసాయం చేస్తున్నాడు. ఈ ఏడాది పత్తి సాగు చేయగా సరైన దిగుబడి రాలేదు. కుటుంబ అవసరాల నిమిత్తం చేసిన అప్పు, సాగుకు తెచ్చిన పెట్టుబడి కలిపి సుమారు రూ.5లక్షల వరకు ఉందని, వాటిని ఎలా తీర్చాలో అంటూ కొంతకాలంగా మదనపడుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో మనస్తాపం చెందిన ఆయన సోమవారం వేకువజామున ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. గ్రామ సమీపంలోని శ్మశానవాటిక వద్ద ఉన్న మోదుగు చెట్టుకు ఉరేసుకుని మృతిచెందాడు. స్థానికులు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. మృతుడి కుమారుడు వెంకటి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో రమ్య తెలిపారు.


